Thursday, June 3, 2010

సీతారామ మారుతి సంవాదము, చేరి వినవే శ్రీదము

కేదారగౌళ - ఆదితాళము
పల్లవి  --  సీతారామ మారుతి సంవాదము, చేరి వినవే శ్రీదము II
అనుపల్లవి ---
శీతాంశుముఖీ యీ, చరితమునందలి
చాతుర్యము చూడు, సంశయము వీడు
ఖ్యాతిగ మును దశ, కంఠుని రవికుల
జాతుడైన రఘురాముడు సబల
వ్రాతముగను జంపి, సాప్తుడై సా
కేతపురికి జేరియున్నతఱిని నడచిన IIసీతాII

హాటక సింహాసనమున రాముడు కోటిసూర్య సమకాంతిని వెలుగుచు
పాటలాధరి ధరాసుతతోడను, పరగ వసిష్ఠాది గురు బుధ మిత్ర
కోటి సేవింప నాదినారాయణుడౌ, మేటి భక్తానుమోది, కమలా వినోది
దీటు లేక కొలువుండి హనుమంతు మనసు, దెలిసి సీతను బలుకుమన ముద్దుగులుక
మాటి భక్తజనాగ్రణి కృతమతి, సాటి లేని శౌర్యధైర్యఘనుడును
మేటియైన యనిల సూను గనుగొని తేట పడగ లోకవిమోహిని బలికెను. IIసీతాII

రాముడు పరమానందమయుడు, సర్వచరాచర పరిపూర్ణు డవ్యయుడు
సామగానలోలు డచలు డాద్యుడు, సర్వసాక్షి సుమ్ము వినిర్ముక్త
కాము డిది నమ్ము, పరమాత్ముడనుచు వేమారు దెలిసికొమ్ము భక్తుల సొమ్ము
సామీరి సంశయమెల్లను పోనిమ్ము, నా మాట మది నమ్ము, ధీనిధివి గమ్ము
యేమనవలెనే మూలప్రకృతిని, యీ మహాత్ము సన్నిధానమాత్రను
ఈ మహాద్భుతము లొనర్చు. మూఢులు స్వామియందు నారోపణ సేయుదురనె IIసీతాII

ఈ కోసలపురిలో రాముడై దశరథునకు నితడు బుట్టుటయును విశ్వామిత్రు యాగము
సాకల్యము సేయుటయు నహల్యకు శాపము కావుటయు, విలువిఱచి నన్ను
చేకొని చెలగుటయు, పరశురాముని ఢాక యడంచుటయు, బురిజేరుటయు
కైక పనుప దండకాటవి కేగుట ప్రాకట మాయాసీతాహృతి యందుచేత
శ్రీకరు రవిసుతు జేరి వాలినటు జీరి వారధిగట్టి రావణుని
భీకరాజి దునిమి నన్ను గై కొని సాకేతము జేరుటెల్ల మత్కృతియనె IIసీతాII 2

ఆ రాఘవునియం దీవిధ మజ్ఞాను లారోపణ సేయుదురు. మధుకైట
భారి నిర్వికారుం డఖిలాత్మకుడు, పరిణామరహితుడు బ్రహ్మ యితడు
సూరిబృంద సుతుడు ఆనందయుతుడు భూరిభువనహితుడు, సకలసమ్మతుడు
కారుణ్యనైర్ఘృణ్య, హేయోపాధేయ సుఖదుఃఖ గమనాగమనాది ద్వంద్వములు లేవీ
శ్రీరమణీయున కీవిభు నెరిగిన వారిజేర వెఱచిమాయ పరువిడు
దారితారి శేషశైలశిఖర విహారిజేరి కడతేరు దారియిది IIసీతాII 4

రావణవధా నంతరము శ్రీరాముడు సీతతో అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై కోటిసూర్యుల కాంతితో వెలుగుతూ సింహాసనాన్నధిష్టించి, వసిష్ఠాది గురువులు, బుధుల సమక్షంలో సుగ్రీవ అంగద జాంబవంతాది మిత్రులు సేవిస్తుండగా ఆదినారాయణుగా వెలుగొందుచూ భక్తులకు కొంగుబంగారమై ఆ సభను కొలువున్నప్పుడు ఆ శ్రీరాముడు హనుమంతుని మనసెరిగిన వాడై  సీతను హనుమతో మాట్లాడమని అనుజ్ఞ యిచ్చాడు. అప్పుడు సీతాదేవి భక్తులలో అగ్రేసరుడూ, సాటిలేని పరాక్రమవంతుడూ ఐన హనుమతో విషయమంతా తేటతెల్లమయ్యేలా ఈ విధంగా  పలికినదట.
శ్రీరామచంద్రుడు పరమ ఆనందమయుడు, సర్వ చరాచరజీవులతోనూ పరిపూర్ణుడు, అవ్యయుడూను. అతడు సామగానలోలుడు, అచలుడు, సృష్టికి ఆద్యుడైనవాడు, సర్వమునకు సాక్షిరూపుడు. వినుర్ముక్తమైన కామము గలవాడు. ఇది నమ్ము. ఆతడు పరమాత్ముడనే విషయాన్ని ఎప్పుడూ మఱచిపోవద్దు. ఆతడు భక్తపరాధీనుడు. ఓ ఆంజనేయా ! ఈ విషయంలో ఎంతమాత్రమూ సందేహము వద్దు. నా మాటను నీ మనస్సులో నమ్ము. ధీనిధివి కమ్ము. మూలప్రకృతియే స్వామి. ఈ మహాత్ముని సన్నిధానమే మహాద్భుతమైనది. ఇది తెలియని మూఢులు స్వామి యందు మిథ్యారోపణలు చేస్తూ ఉంటారు. -  అని పలికినది సీత.

ఈ కోసల నగరంలో దశరథునికి పుత్రుడుగా జన్మించిన శ్రీరాముడు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించాడు. అహల్య శాపాన్ని పోగొట్టాడు. శివధనుస్సుని విఱచి నన్ను చేపట్టాడు. పరశురాముని గర్వభంగం కావించాడు. అయోధ్యను చేరి పట్టాభిషేకం జరగాల్సి ఉండగా కైక చెప్పిన విధంగా దండకారణ్యానికి వనవాసానికై బయలుదేరి వెళ్ళాడు. అక్కడ మాయాసీతను రావణుడపహరింపగా సుగ్రీవునితో చెలిమి చేసి వాలిని చంపి వారధిని నిర్మించి రావణుడిని పరిమార్చి తిరిగి సాకేతపురానికి నన్ను చేర్చాడు.
అటువంటి రాఘవునిగూర్చి అజ్ఞానులు ఆరోపణలు చేస్తుంటారు. ఇతడు మధుకైటభులను నిర్జించిన ఆ శ్రీమన్నారాయణుడే. నిర్వికారుడు, అఖిలాత్మకుడు, పరిణామరహితుడు,సాక్షాత్ బ్రహ్మయే, పండితబృందాలచే కొనియాడబడేవాడు, కారుణ్యాన్ని కలిగి ఉండేవాడు, సుఖదుఃఖాల కతీతుడు. ఈ శ్రీరామచంద్రుని తెలిసినవారిని చేరుకోటానికి మాయ భయపడి పాఱిపోతుంది. ఈ విభుడే ఆ శేషాశైలవాసుడైన శ్రీ వేంకటేశ్వరుడు . ఆయనను చేరిన భక్తులు సాయుజ్యం పొందుతారు.

No comments:

Post a Comment