Monday, May 24, 2010

వినవే సత్యవాణీ శర్వాణీ అలి , వేణీ నీరజపాణీ

3. భైరవి - ఆటతాళము 
పల్లవి - వినవే సత్యవాణీ శర్వాణీ అలి , వేణీ నీరజపాణీ II

అను పల్లవి -
ననుగోరి భజియించి
నను  మదిలోనుంచి
నను వరదుడు నౌదు, సందియము లేదు
మునుపు ఇటు లిది యడుగరెవ్వ
రును మహాయోగి వర సంభా
వనము జీవన మమృత సేవనము , జన్మ పావనము .II వినవే II

శ్రీరామునికి నమస్కారము జేసి యని
వారణ  నాత్మత్వము నీకు వివరింతు
నా రాఘవుడు శౌరి , యజ్ఞానహారి జి
తారి శ్రీ విహారి , మాయాధారి
తారక కీర్తి, సత్యజ్ఞానస్ఫూర్తివి
దారి తార్తి దేవ . తా చక్రవర్తి చిదానందమూర్తి
యై రాజిలు శ్రీహరి మాయకెల్ల నా
ధారమైననందువల్ల మోహము కల్ల 
శౌరి ప్రకృతికి నాది నిజమా,
యారూఢి జగములు సృజియించి య
నారతము నభముగతి వెలిలోను , పూర్ణితను బూను . IIవినవేII  1

వితతమాయచే, నిర్మితమైన జగము విస్మృసూచీచుం
బిత, శిలచే బరిమణించు
గతియె కర్తృత్వము, అతనికిలేదు దు
ర్మతులెరుగరీదారి, కోర్కులుమీరి
మతిహీనులైరి యే, మనవచ్చు వారిసం
స్మృతియె కోరి యందు, చే బద్ధులైరి యామధుకైటభారి
అతిశుద్ధ చిద్ఘనుడని తెలియక జ్ఞాన
మతనికి గల దందురు, భువిలో గొందఱు
తతవసుద్యుతి లసన్మాలిక, సుతగళా
న్విత మయ్యు మఱచిన
గతి మనస్థితుడౌ జగద్గురుని , ఖలులెఱుగఁరని II వినవేII 2

అకటా సూర్యునియందు, నప్రకాశత్వము
యొకనాటి కైనను యున్నదే యటువలెనే
ప్రకటమై జ్యోతిస్వ-భావమాత్ముని యందు పనిలేదు మాయవాదు నీవికమీద
అకలంక గనవే నిత్యము నమ్మిమనవే ర
క్షకు డనవే శేష - శైలేశు గనవే భక్తియు చేకొనవే
అకుటిలునకు చాంచల్యము చెప్పుటలు చలదృ
ష్టికి చూడ నునికిపట్లు భ్రాంతమైనట్లు
సకల కాలములను ప్రభమా, లికి పగల్రాత్రి లేనటు నా
త్మకును జ్ఞానాజ్ఞానములు రెండు లేనివై యుండు IIవినవేII 3

పార్వతీ దేవికి శివుడు - వినవే సత్యవాణీ( నిజాన్నే పలికేది ) శర్వాణీ( పార్వతీ )  అలివేణీ (తుమ్మెదలవంటి జడ కలిగినది) నీరజపాణీ( తామరపద్మాల్లాంటి అరచేతులు కలిగినది)  అని మొదలుపెట్టి జవాబుగా రామకథను చెపుతున్నాడు. నన్ను కోరి, పూజిస్తూ నేను వరాలిచ్చేవాడినని గ్రహించినావు. రామకథను  ఇదివరకెవ్వరూ ఇలా చెప్పమని అడగలేదు, రామకథ మహాయోగికి వరాల్నొసగేది, జీవితాన్ని అమృతమయం చేసి ,జన్మను పావనము చేసేది -- అంటూ శ్రీరామునికి నమస్కారము చేసి రామాయణ కథను  చెప్పటానికి ప్రారంభిస్తున్నాడు .

నివారణ లేని ఆత్మతత్త్వాన్ని నీకు వివరిస్తాను. ఆ రాఘవుడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, అజ్ఞానాన్ని హరించేవాడు , శత్రువులను జయించేవాడు లక్ష్మితో కలిసి విహరించేవాడు, మాయాధారి , కీర్తిమంతుడు , ఆర్తులకు సత్య జ్ఞానాల స్ఫూర్తిని కలిగించే దేవతాచక్రవర్తి , చిదానందుడై రాజిల్లేవాడు. శ్రీహరి మాయలకెల్ల ఆధారమైనందువల్ల అతనిలో మోహము లేదు - శౌరి,  ప్రకృతికి ఆదిరూపము.  తన నిజ మాయతో ఈ జగత్తులను సృష్టిస్తూ ఎల్లప్పుడూ ఆకాశమువలె లోన బయటా పూర్ణతను సంతరించుకొని ఉండేవాడు అటువంటి శ్రీరామకథను వినవే --  సత్యవాణీ --

ఈ జగత్తు విరివైన మాయచే నిర్మితమైనది, విస్మృతి అనబడే సూచికతో చుంబించబడిన శిలచే మార్పు చెందుతూం డటం గతిగా కలది. అతనికి కర్తృత్వము లేదు . దుర్మతులైనవారు ఈ మార్గాన్ని తెలియలేరు. వారు కోరికలు పెరిగి మతిలేనివా రైనారు. అట్టివారిని ఏమని అంటాం ? వారీ సంసారాన్ని కోరి అందులో బద్దులైపోయారు. ఆ మధు కైటభులను వధించిన శ్రీహరి అతిశుద్ధమై కప్పబడిన ఘనతను కలిగిన వాడు. అది తెలుసుకోలేక అతనిని అజ్ఞానవంతుడని అంటారు. ఈ భూమిమీద కొందఱు ఆ బంగారపు ప్రకాశంతో కూడి కీర్తించబడిన అతని కంఠసీమ నలంకరించిన మాలికను మఱచిపోయినట్లుగా -- మనస్థితుడైన ఆ జగద్గురువుని పాపులు ఎఱగరని -- వినవే సత్యవాణీ --
ఒకనాటికైన సూర్యుని యందు ప్రకాశలేమి అనేదే ఉండదు . అలానే ఆత్మయందు కూడా జ్యోతి స్వభావమనేది ఎప్పడూ విడిచిపెట్టదు. మాయ పోదు. అకలంకవై ఇకమీద ఆ స్వరూపాన్ని దర్శించవే. నిత్యమూ నమ్మి బ్రతకవే. ఆతడే రక్షకుడని అనవే. ఆ శేష శైలవాసుని చూడవే. భక్తి చేకొనవే. అకుటిలునకు చాంచల్యమున్నదని చెప్పటం చంచల దృష్టి గలవానికి ఉన్నవస్తువులు లేనివిగా కనబడినట్లు భ్రాంతి కలిగించిటం . అన్ని కాలాల్లోనూ ఆ సూర్య భగవానునికి రాత్రి పగలు అనే భేదము లేనట్లుగా ఆత్మకు జ్ఞానాజ్ఞానములనేవి రెండూ లేనివే . ఇది వినవే-- సత్యవాణీ --

పాటకు అర్థాన్ని సరిగా వివరించ గలిగానో లేదో తెలియదు. పొరపాట్లేమన్నా ఉంటే పెద్దలు తెలియజేయగలరు


Friday, May 14, 2010

ఈ సంశయము వారింపవే, పర, మేశ నన్ను మన్నింపవే

2. రేగుప్తి రాగము - ఆటతాళము

పల్లవి - ఈ సంశయము వారింపవే, పర, మేశ నన్ను మన్నింపవే

అనుపల్లవి - శ్రీ సదాశివ ప్రశ్న , జేసెద వివరింపు
              వాసుదేవతత్త్వము, మహత్త్వము
              భాసమానవిలాస నే నిదె 
              నీ సత్కృపావలోకనమున
              నీ సమయమున దెలియవలసిన
              దే సమస్త మిదే ప్రశస్తము  IIఈ సంశ II

జ్ఞాన విజ్ఞాననిశ్చల భక్తివైరా, గ్యానందములకు నిధానమైవిన్న
శ్రీనిలయమై వెన్నవలె మృదువై యస, మానమై నుతిగన్న, మార్గము మిన్న
యైన బహుగోప్యతరమైనయ , నూనముగ సెలవిమ్ము చంచల
లే నితంబినులను నే నీదానదానవవైరి మ్రొక్కద IIఈ సంశII 1

వారిజాక్ష జగదాధారమూ ర్తియై , శ్రీరామునియందు సారసద్భక్తి
కారూఢమై ముక్తి కారణమై యల, రారు నొక్కయుక్తి నాదిశక్తి
మీరరసి ధీరరసికాళిక సారకళ లూర బలుకుము భవ
నీరధికి తారకము భక్తిమీర సుజనులను వేఱె లేరని IIఈ సంశII 2

దేవ శ్రీరాముని దేవదేవునిగా ష, డ్భావాతీతునిగా సుధీవరులెల్ల
భావము రంజిల్ల బల్కుదురతని, భావింతు రదియెల్ల గల్ల గాదె
గావునను శ్రీవిభు ముక్తికి , కేవలము తావలమటైనను
శ్రీ వెలయు భూవలయమున తను, భావుడై జీవుడైన దేమి IIఈ సంశII 3

మాయావృతుడై రామస్వామి సన్ముక్తి దాయకుని గనుతన దాం దె
లియలేడు వేయేల నతడు జూడు, ఆత్మను తత్త్వవేత్తకే నేడు దెలిపినాడు
మాయికుడటంచు రొక కొందఱదేయదార్థము సేయసుజన
ధ్యేయండెటులగునైన జానకి, కాయెడల దా నడల నేటికి IIఈ సంశII4

ఈ వాక్యముల కర్థమీవుగా కితరులు, భావించి పలుక నేర్పరులెవరులేరు
దేవుడవై చెలువుమీరు నిన్ను జేరు , ధీరాత్ములు గోరు కోర్కె లీడేరు
ఈ వసుధ శేష శైలాధిపుడై వెలుగు రాఘవు చరితమును
ధావర్షమై చెవులుపండునుగావించు సేవించు జనులకు IIఈ సంశయII 5

మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు మొత్తం రామాయణ కావ్యాన్ని ( పట్టాభిషేకం వఱకూ ) సుమారు 100 కు పైగా కీర్తనలలో విరచించారు. సుమారుగా ప్రతి కీర్తనకూ పల్లవి , అనుపల్లవి , 5 లేక 6 చరణాలు ఉంటాయి. వీరి కీర్తనలు ద్రాక్షాపాకంతో అలరారుతూ బహువిధమైన అలంకారాలతో కూడి సొగసైన పాటలుగా పాడుకోవటానికి మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. నాకు అర్థమయినంతవరకూ ఈ కీర్తనలలోని అర్థాన్ని చదువరులకు అందించాలనేదే నా తాపత్రయం. ఈ విధంగా నేను చేసే ప్రయత్నంలో తప్పులు దొర్లితే పెద్దలు క్షమించి తెలియజేయ ప్రార్థన.
ఈ రెండవ కీర్తనలో పార్వతీ దేవి శివుడిని రామాయణ కథను చెప్పమని అభ్యర్ధిస్తుంది. ఈ సంశయము వారింపవే, పరమేశ నన్ను మన్నింపవే అని మొదలుపెడుతుంది ఆవిడ పరమేశ్వరుడిని.
రామాయణ గాథ జ్ఞానవిజ్ఞాన దాయకమూ, నిశ్చలభక్తి వైరాగ్యదాయకమై విన్నప్పుడు మనస్సుకు  ఆనందాన్ని చేకూరుస్తుంది. . వెన్నవలె మృదువైనది, అసమానమైనది, ప్రఖ్యాతిని గన్నదీ, మిన్నయైన మార్గాన్ని చూపించేదీను, అట్టి బహురహస్యమైన ఆ కథను నాకు వినిపించండి నేను నీ దానను ఓ దానవ వైరీ ! ఈ సంశయము వారింపవే  అని  పార్వతీదేవి మహేశ్వరుడిని ప్రార్ధిస్తుంది..
జగధాధారమూర్తియైన శ్రీరామచంద్రుని యందుగల భక్తి ఒక ఉపాయమై ముక్తికి కారణమవుతుంది . ఆదిశక్తిని మీరు దర్శించి వివరముగా తెలియజేయండి.
దేవా ! శ్రీరాముని దేవదేవునిగాను, షడ్భావాతీతునిగాను సుధీవరులందఱూ చెబుతుంటారు. అది నిజము కాదు గదా . శ్రీవిభుడు ముక్తికారకుడు, లక్ష్మీదేవి వెలసిన ఈ భూమిమీద మానవ స్వరూపాన్ని ఎందుకు ధరించాడు ?  మాయచేత చుట్టబడి రామచంద్రమూర్తి తానే ముక్తిదాయకుడినని తెలియలేడు. ఆతడు ఆత్మను నేడు తత్త్వవేత్తకే తెలిపినవాడు . అతడు అమాయకుడని కొందఱు భావిస్తే సుజనులకు పూజనీయుడెటు లయ్యాడు ? అతడు జానకీ దేవికి ఎందులకై  భయపడాల్సివచ్చింది ?
ఈ నా సందేహాలకు  నీవుగాక ఇంకెవ్వరూ సరియైన సమాధానాలను ఇవ్వలేరు . దేవుడవైన నిన్నుచేరినవారి కోర్కెలు ఈడేరతాయి. ఈ భూమిమీద శ్రీ వేంకటేశ్వరుని రూపంలో వెలసిన రాఘవుని చరితాన్ని నాకు చెవులపండువుగా సంపూర్ణంగా చెప్పవలసింది, నా పై సందేహాల్ని తీర్చవలసింది.

 http://maganti.org/audiofiles/air/songs/adhyatma2.html

నమశ్శివాయ తే నమోభవాయ








http://maganti.org/audiofiles/air/songs/adhyatma1.html


 


 


 ధన్యాసి -- ఆది తాళము

పల్లవి ---
నమశ్శివాయ తే నమోభవాయ II
అనుపల్లవి ---
సమానాధిక రహితాయ శాన్తాయ స్వప్రకాశాయ
ప్రమోద పూర్ణాయ , భక్తౌఘ పాలణాయ IIనమII

గర్వితదానవలోక , ఖణ్డనాయ శ్రీరజత
పర్వతాగ్ర నిలయాయ పావనాయ
సర్వలోక పాపపుంజ , నిర్వాపణాయ శర్వాయ
దర్వీకరభూషణాయ , సర్వోత్తమాయ IIనమII 1

అణ్డజాధిపవాహన కాణ్డాయ మేరుశైలకో
దణ్డాయ శితి కంఠాయ పండితాయ
మండిత త్రిపురజయో ద్దండతాండవాయ
బ్రహ్మాండ నిలయాయ మహా , మాయాతీతాయ IIనమII 2

మందహాసవదనార , వింద సుందరాయయోగి
బృందానందదాయ శత్రుభీకరాయ
ఇందుసూర్యాగ్ని నేత్రాయ , వందిత ప్రమథగణాయ
నందివాహనాయ పోషిత , బృందారకాయ IIనమII 3

నిరుపమానందఘన , నిశ్చితాయ శాశ్వతాయ
వరదా భయంరణాయ , గిరిశాయ
తరుణేన్దు శేఖరాయ , పరమపురుషాయ భవ
కారణాయ శ్రీకాళ, హస్తీశ్వరాయ IIనమII 4

గంగాభంగతరంగ సంగతజటాజూటాయ
సంగీతలోలాయ శుభ , సంగతాయ
అంగజాస్తరంగమద , భంగాయ స్ఫటికోప
మాంగాయ శేషశైలాధీశమిత్రాయ IIనమII 5

రామాయణ కావ్యాన్ని ఎందరెందరో కవులూ గాయకులూ ఎన్నొన్నో విధాలుగా గానం చేసారు పూర్వకాలం నుండీ కూడా. ఎవరెంతమంది ఎన్నెన్ని విధాలుగా కీర్తించినా గానీ కీర్తించవలసినది ఇంకా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది.అదే రామాయణం యొక్క గొప్పతనం. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వారి కల్పవృక్ష రచన ప్రారంభంలో ఇదే చెప్తారు. పైసంకీర్తనలోని వృత్యనుప్రాసను గమనించండి. 'య' అనే అక్షరం ఎన్నిసార్లు మరలా మరలా వచ్చిందో. ఇటువంటి అనుప్రాసలూ మొదలయినవి పాటగా పాడేటప్పుడూ , చదివేటప్పుడూ మంచి అందాన్నీ , ఊపునూ తీసుకువస్తాయి.