Saturday, June 19, 2010

శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మన కౌసల్య యా త్మా రాముని గాంచెను

9.
శంకరాభరణము -- ఆట తాళము

పల్లవి --

శ్రీరాముని గాంచెను
పార్వతీ వినవే మన కౌసల్య యా
త్మా రాముని గాంచెను IIశ్రీరామునిII

అను పల్లవి --
తోరమై హర్షాశ్రు 
పూరమై కన్నుల 
జార భయ సంభ్ర మా
శ్చర్యము ల్బెనగొనగా IIశ్రీరామునిII

అలనల్ల కలువ ఱే
కుల చాయ మేనితో
జెలగువాని పసిడి
చేల గట్టినవాని
వెలయు నాల్గు భు
జములవాని కనుగొ
ల్కుల నరుణ రేఖలు
కలవాని స్వర్ణకుం
డల లసిత గండమం
డలములవాని య
స్ఖలిత రవికోటి ప్రకాశుని రత్నో
జ్వల కిరీటమువాని
నళినూల కుటిల కుం
తలములచే ముద్దు
గులుకు చుండెడివాని IIశ్రీరామునిII 1


ఘనతర శంఖ చక్ర గదాబ్జములవాని
వనమాలికా యరుత దనరు వాని చిరున
వ్వను వెన్నెలలా నవచంద్రుడు దిక్కు
లను వెదచల్ల జెల్వ ల రారెడు వాని
యనుమాన కరుణామృత పూర్ణ నే
త్రుని మంజీరాంగదుని శ్రీవత్సకటకం
కణహార కేయూర కౌస్తుభాది భూ
షణ భూషితుని జూచి తనివి తీరక తిరుగ IIశ్రీరామునిII 2


శరణా గతులను కరుణ రక్షించు శ్రీ
ధర నీకు బహు వందనము లొనర్చెద
శరణు గర్విత దనుజ చయ విరామరామ
శరణు దేవతా సార్వభౌమ నీవే
పరమాత్ముడవు జగత్పతి వీశుడవు హరివి
పరయోగి బృంద ద్వనజ కర్ణికాం
తరమున సురుచిర రాకాజ్యోతివై
మెఱయు నిన్నెన్న నాతరముగాదని తిరుగIIశ్రీరామునిII 3


ఈశ నీవు నిఖిలేంద్రియ సాక్షివి
శ్రీశుడి వీ విశ్వ సృష్టి సంరక్షణ
నాశము లొకటను జేసి సేయకున్న
వాశిచే బోయి పోవని వాడవై ప్రకృతి
డాసి డాయనివాడ వై శాశ్వతుడ వై యా
కాశాది భూత సంఘములకెల్ల నవ
కాశమై నీవు ప్రకాశింతు విది మాయా
పాశాది బద్ధుల కెఱుగ వశముగాదని తిరుగ IIశ్రీరామునిII 4


నీ జఠరము నందనేక బ్రహ్మాండము లీ
యోజ బరమాణువులై యున్నవిపుడు నీవు
రంజిల్లు నా యుదరమున బుట్టుట కల్ప
భూజము ముంగిట మొలచినట్లయ్యె నం
భోజాక్ష పతి ధన పుత్రాది సక్తనై
నే జెల్ల సంసార నీరధి బడనొల్ల
శ్రీజాని నీ శరణు జెందితి నామదిని
దేజరిల్లుచును సుస్థిరుడవు గమ్మని IIశ్రీరామునిII 5


ఈ యఖిలమును మోహింప జేయు నీదు
మాయకు నగుపట జేయకు నను శేష
శాయి యీ రూప ముపసంహరింప గదోయి
కాయజ జనక చక్కని ముద్దుపట్టివై నన్నలర
జేయు మమితా నంద
దాయివని నిను మదిని దలతురు ఘనులెల్ల
మాయురే యనుచు వే మారును వినుతించి
శ్రీయుత మూర్తి యా శేషాచలేశుడౌ IIశ్రీరామునిII 6

3 comments:

  1. సుత్తి అనుక్కోకపోతే నా స్టోరీ:
    వెదురుపర్తి అని అనకాపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోని కుగ్రామం. వేదుల దక్షిణా మూర్తి గారు నా మాతామహుడు. హవిర్యాజి. నిత్యాగ్నిహోత్రులు. మా అమ్మ గారు వారి రెండో కుమార్తె. నేను మా తాత గారి ఇంట్లోనే పెరిగేను. నా చిన్నప్పుడు ఆ ఊరికి కరెంటూ లేదు, బస్సు సౌకర్యం లేదు. మా అమ్మ గారు (శ్రీమతి మహావ్రతయాజుల శారదాంబ) తెల్లవారుఝామున నాలుగ్గంటలకి నిద్రలేచి ఇంటి పనులు మొదలు పెట్టేవారు. రాత్రి సమయం ఎంతయిందీ తెలుసుకోడానికి వాచీ కూడా లేదు. కాని ఆకాశంలోని సప్తర్షిమండలం కనిపించే దిశను బట్టి ఆమె టైం తెలుసుకునేవారు. దినచర్య (అంటే మజ్జిగ చిలకడం, వేణ్ణీళ్ళ పొయ్యి రాజేయడం, వాకిట్లో కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టడం వగైరాలు) పూర్తయేసరికి బారెడు పొద్దెక్కేది. ఇంతసేపూ మా అమ్మ ఏదో స్తోత్రాలను రాగయుక్తంగా పాడుకునేది. ఆమెతో పాటే నేను లేచి కాళ్ళకడ్డం పడేవాడిని. వినికిడి వల్ల నాకూ కొన్ని స్తోత్రాలు అబ్బేయనుకోండి. ఉదయం పాడే స్తోత్రాల లిస్టు: గజేంద్రమోక్షం, కుచేలోపాఖ్యానం, వినాయకుడి మీద ఒక స్తోత్రం - రార ధూర్జటిసుత వినాయక అని మొదలయేది, శ్రీకృష్ణుని చల్దులు, గంగాస్తవం, సూర్యోదయమవుతోందనగా సూర్యాష్టకం, రమణగీత, ఆదిత్యహృదయం, శ్రీ రామాష్టోత్తర శతనామస్తోత్రం, కృష్ణాష్టకం, కృష్ణాష్టోత్తర శతనామస్తోత్రం, రామాయణ సీసమాలిక మొదలయినవి. మహలక్ష్మి పూజ మంగళ హారతి సమయంలో పాడే పాటల లిస్టు మళ్ళీ సెపరేటు. అవి రోజును బట్టి మారేవి.
    సాయంత్రం మళ్ళీ వంటకి మడికట్టుకుని పాడే స్తోత్రాలు, గీతాలు వేరు. అవి - శివ మానస పూజ, అర్ధనారీశ్వర స్తోత్రం, అధ్యాత్మ రామాయణ కీర్తనలు వగైరాలు.
    మా అమ్మ పాడే పాటల్లో అధ్యాత్మ రామాయణ కీర్తనలంటే నాకెంత ఇష్టమో. నమశ్శివాయతే నమోభవాయ (అభేరి రాగంలా ఉంటుంది) తో మొదలయ్యేవి. ఆ విధంగా పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరిస్తున్నట్టు సాగే ఆ పాటల మాధుర్యాన్ని మా అమ్మ పాడగలిగి ఉండగా రికార్డు చేసుకోలేకపోయిన దౌర్భాగ్యం నాది. నాకు అత్యంత ఇష్టమైన కీర్తనలు - శ్రీరాముని గాంచెను, అందముగ ఈ కథ వినవే, ఇందువదనా, సేవకజీవమణి వినవే రమణి, దేవాదిదేవుని రాముని సత్యవాణి, సుఖీభవ యనవే, శృంగారానంతా - ఇత్యాదులు. ఇప్పుడు మా అమ్మ వృద్ధాప్యం వల్ల ఏ పాటలూ పాడే స్థితిలో లేదు. తన అధ్యాత్మ రామాయణకీర్తనల పుస్తకం జీర్ణమైపోతే కొత్తది తెచ్చిపెట్టమని ఎన్ని సార్లు చెప్పిందో. కనీసం ఆ చిన్న బాధ్యత కూడా నేను నెరవేర్చలేదు. మీ బ్లాగులో అధ్యాత్మ రామాయణ కీర్తనలు చూస్తుంటే నా బాల్యం మా అమ్మా గుర్తుకొచ్చి ఎంతో భావోద్వేగం కలిగింది.

    surya

    ReplyDelete
  2. అయ్యా నమస్కారం. మీరు చేసిన కామెంటుకు నా ధన్యవాదాలు. నా పేరు మల్లిన నరసింహారావు. వయస్సు 62 సంవత్సరాలు. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు దగ్గఱలోని ఉండ్రాజవరం గ్రామం. ప్రస్తుత నివాసం 1998 నుండీ ఇప్పటివఱకూ (ఉద్యోగరీత్యా) తూ.గో.జిల్లా లోని పెద్దాపురం గ్రామం. శ్రీ వేదుల బాలకృష్ణమూర్తి గారు (93) వయోవృద్ధులు రిటైర్డు రైల్వే ఎంప్లాయి, ప్రస్తుతం శ్రీకాకుళం లో ఉంటున్నారు నాకు ఆత్మీయ స్నేహితులు. " వేదుల బాల " అనే బ్లాగు లోని వన్నీ వారి స్వంత రచనలు. నేనే పోస్టు చేస్తుంటాను వాటిని కూడా, నా ఇ మెయిలు చిరునామా ద్వారా. మీ పూర్తి పేరు తెలియరాలేదు, అభ్యంతరం లేకపోతే వివరాలు తెలియజేయండి. మీ తల్లి గారు శ్రీమతి శారదాంబగారి గుఱించి మీరు వ్రాసిన విషయాలు చదివి చాలా ఆనందించాను. ఇప్పటి స్త్రీలందరూ వివిధ కారణాలవల్ల అటువంటి సాహిత్య పఠనానికీ , సంగీతవ్యావృత్తికీ దూరం అవుతున్నారు. వేదుల వారు కూడా వారి తల్లి గారు పాడే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలను గుఱించి చెప్పేవారు. అప్పటినుండీ వాటిని సేకరించాలనీ, బ్లాగులో పెట్టాలనీ కోరిక. హైదరాబాదులోని మిత్రులు శ్రీ పిరాట్ల రామమోహన శాస్త్రి గారు నా కోసం కష్టపడి భాగ్యనగరం లోని పుస్తకాల షాపుల్ని గాలించి గాలించి పుస్తకాన్ని సాధించి విజయవాడలో అన్నమయ్య సంకీర్తనా ప్రోగ్రాం దగ్గఱ నా కందించారు. ఆ పుస్తకం వెల 36 రూపాయలు. ఆ డబ్బును నేనిస్తుంటే వారు సున్నితంగా తిరస్కరించారు. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ 2002 అనిఉంది. ప్రింటర్సు వెంకట సత్య ప్రింటర్స్, దాసువారివీధి, అరండల్ పేట, విజయవాడ-2. అని ఉంది. మొదటి కీర్తన - నమశ్శివాయ తే నమో భవాయ ధన్నాసి రాగం - ఆది తాళం అని ఉంది. మీరు అభేరి రాగం అన్నారు. నాకు సంగీతం అసలు ఏమీ తెలియదు. ఈ కీర్తనలనన్నింటినీ ఈ బ్లాగులో పోస్టు చెయ్యాలని నాకోరిక. ఈ కీర్తనలను ఎవరైనా గానం చేసి రికార్డు చేసి అనుబంధంగా చేర్చగలిగితే ఎంతో బావుంటుంది. నా ఈ కోరిక కూడా నెరవేరుతుందనే నా ఆశ.

    ReplyDelete
  3. ఆలస్యానికి క్షమించాలి. నా పేరు సూర్యనారాయణ. నలభై ఆరేళ్ళు. విశాఖ వాసిని. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా బెంగుళూరులో ఉంటున్నాను.
    పూజ్యులు శ్రి వేదుల బాలకృష్ణ మూర్తి గారి రచనోత్సాహానికి, వారి పట్ల మీ గౌరవస్నేహాభిమానాలకు, విశేషించి అధ్యాత్మ రామాయణ కీర్తనలను పరిచయం చేయాలనే మీ అభిలాష అభినందనీయం.
    మీరన్నట్టు నమశ్శివాయతే నమోభవాయ ధన్యాసి రాగమే అయుండవచ్చు.
    నాకూ ఒక బ్లాగుంది. వీలుంటే ఒకసారి చూడండి. www.suryamahavratayajula.wordpress.com

    ReplyDelete