Monday, May 24, 2010

వినవే సత్యవాణీ శర్వాణీ అలి , వేణీ నీరజపాణీ

3. భైరవి - ఆటతాళము 
పల్లవి - వినవే సత్యవాణీ శర్వాణీ అలి , వేణీ నీరజపాణీ II

అను పల్లవి -
ననుగోరి భజియించి
నను  మదిలోనుంచి
నను వరదుడు నౌదు, సందియము లేదు
మునుపు ఇటు లిది యడుగరెవ్వ
రును మహాయోగి వర సంభా
వనము జీవన మమృత సేవనము , జన్మ పావనము .II వినవే II

శ్రీరామునికి నమస్కారము జేసి యని
వారణ  నాత్మత్వము నీకు వివరింతు
నా రాఘవుడు శౌరి , యజ్ఞానహారి జి
తారి శ్రీ విహారి , మాయాధారి
తారక కీర్తి, సత్యజ్ఞానస్ఫూర్తివి
దారి తార్తి దేవ . తా చక్రవర్తి చిదానందమూర్తి
యై రాజిలు శ్రీహరి మాయకెల్ల నా
ధారమైననందువల్ల మోహము కల్ల 
శౌరి ప్రకృతికి నాది నిజమా,
యారూఢి జగములు సృజియించి య
నారతము నభముగతి వెలిలోను , పూర్ణితను బూను . IIవినవేII  1

వితతమాయచే, నిర్మితమైన జగము విస్మృసూచీచుం
బిత, శిలచే బరిమణించు
గతియె కర్తృత్వము, అతనికిలేదు దు
ర్మతులెరుగరీదారి, కోర్కులుమీరి
మతిహీనులైరి యే, మనవచ్చు వారిసం
స్మృతియె కోరి యందు, చే బద్ధులైరి యామధుకైటభారి
అతిశుద్ధ చిద్ఘనుడని తెలియక జ్ఞాన
మతనికి గల దందురు, భువిలో గొందఱు
తతవసుద్యుతి లసన్మాలిక, సుతగళా
న్విత మయ్యు మఱచిన
గతి మనస్థితుడౌ జగద్గురుని , ఖలులెఱుగఁరని II వినవేII 2

అకటా సూర్యునియందు, నప్రకాశత్వము
యొకనాటి కైనను యున్నదే యటువలెనే
ప్రకటమై జ్యోతిస్వ-భావమాత్ముని యందు పనిలేదు మాయవాదు నీవికమీద
అకలంక గనవే నిత్యము నమ్మిమనవే ర
క్షకు డనవే శేష - శైలేశు గనవే భక్తియు చేకొనవే
అకుటిలునకు చాంచల్యము చెప్పుటలు చలదృ
ష్టికి చూడ నునికిపట్లు భ్రాంతమైనట్లు
సకల కాలములను ప్రభమా, లికి పగల్రాత్రి లేనటు నా
త్మకును జ్ఞానాజ్ఞానములు రెండు లేనివై యుండు IIవినవేII 3

పార్వతీ దేవికి శివుడు - వినవే సత్యవాణీ( నిజాన్నే పలికేది ) శర్వాణీ( పార్వతీ )  అలివేణీ (తుమ్మెదలవంటి జడ కలిగినది) నీరజపాణీ( తామరపద్మాల్లాంటి అరచేతులు కలిగినది)  అని మొదలుపెట్టి జవాబుగా రామకథను చెపుతున్నాడు. నన్ను కోరి, పూజిస్తూ నేను వరాలిచ్చేవాడినని గ్రహించినావు. రామకథను  ఇదివరకెవ్వరూ ఇలా చెప్పమని అడగలేదు, రామకథ మహాయోగికి వరాల్నొసగేది, జీవితాన్ని అమృతమయం చేసి ,జన్మను పావనము చేసేది -- అంటూ శ్రీరామునికి నమస్కారము చేసి రామాయణ కథను  చెప్పటానికి ప్రారంభిస్తున్నాడు .

నివారణ లేని ఆత్మతత్త్వాన్ని నీకు వివరిస్తాను. ఆ రాఘవుడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, అజ్ఞానాన్ని హరించేవాడు , శత్రువులను జయించేవాడు లక్ష్మితో కలిసి విహరించేవాడు, మాయాధారి , కీర్తిమంతుడు , ఆర్తులకు సత్య జ్ఞానాల స్ఫూర్తిని కలిగించే దేవతాచక్రవర్తి , చిదానందుడై రాజిల్లేవాడు. శ్రీహరి మాయలకెల్ల ఆధారమైనందువల్ల అతనిలో మోహము లేదు - శౌరి,  ప్రకృతికి ఆదిరూపము.  తన నిజ మాయతో ఈ జగత్తులను సృష్టిస్తూ ఎల్లప్పుడూ ఆకాశమువలె లోన బయటా పూర్ణతను సంతరించుకొని ఉండేవాడు అటువంటి శ్రీరామకథను వినవే --  సత్యవాణీ --

ఈ జగత్తు విరివైన మాయచే నిర్మితమైనది, విస్మృతి అనబడే సూచికతో చుంబించబడిన శిలచే మార్పు చెందుతూం డటం గతిగా కలది. అతనికి కర్తృత్వము లేదు . దుర్మతులైనవారు ఈ మార్గాన్ని తెలియలేరు. వారు కోరికలు పెరిగి మతిలేనివా రైనారు. అట్టివారిని ఏమని అంటాం ? వారీ సంసారాన్ని కోరి అందులో బద్దులైపోయారు. ఆ మధు కైటభులను వధించిన శ్రీహరి అతిశుద్ధమై కప్పబడిన ఘనతను కలిగిన వాడు. అది తెలుసుకోలేక అతనిని అజ్ఞానవంతుడని అంటారు. ఈ భూమిమీద కొందఱు ఆ బంగారపు ప్రకాశంతో కూడి కీర్తించబడిన అతని కంఠసీమ నలంకరించిన మాలికను మఱచిపోయినట్లుగా -- మనస్థితుడైన ఆ జగద్గురువుని పాపులు ఎఱగరని -- వినవే సత్యవాణీ --
ఒకనాటికైన సూర్యుని యందు ప్రకాశలేమి అనేదే ఉండదు . అలానే ఆత్మయందు కూడా జ్యోతి స్వభావమనేది ఎప్పడూ విడిచిపెట్టదు. మాయ పోదు. అకలంకవై ఇకమీద ఆ స్వరూపాన్ని దర్శించవే. నిత్యమూ నమ్మి బ్రతకవే. ఆతడే రక్షకుడని అనవే. ఆ శేష శైలవాసుని చూడవే. భక్తి చేకొనవే. అకుటిలునకు చాంచల్యమున్నదని చెప్పటం చంచల దృష్టి గలవానికి ఉన్నవస్తువులు లేనివిగా కనబడినట్లు భ్రాంతి కలిగించిటం . అన్ని కాలాల్లోనూ ఆ సూర్య భగవానునికి రాత్రి పగలు అనే భేదము లేనట్లుగా ఆత్మకు జ్ఞానాజ్ఞానములనేవి రెండూ లేనివే . ఇది వినవే-- సత్యవాణీ --

పాటకు అర్థాన్ని సరిగా వివరించ గలిగానో లేదో తెలియదు. పొరపాట్లేమన్నా ఉంటే పెద్దలు తెలియజేయగలరు


No comments:

Post a Comment