Saturday, August 17, 2013

సరస గుణమణి సన్మందర సఖీకృతేందిరా, IIవినవేII

తోడిరాగము           ఆటతాళము

పల్లవి---
సరస గుణమణి సన్మందర సఖీకృతేందిరా, IIవినవేII
అను పల్లవి--
గరిమమున రాఘవుని యభిషే, కమహోత్సవము శుభ మనక భయా
కర మనుట యేమి శ్రీరాముడ కౌసల్యగా ననుజూచునను
పరమసమ్మతములైన కైక, వచనము ల్వినగ జాలక మం
ధర నీ సుతునకు నీకు సుఖము, దలచినాను దాయగాను దలపకు  IIసరసII

కైక విను భరతశతృఘ్నుల, కేకయపురికనిచి నీ కాంతు
డో కాంత యేకాంతమున సీ, తాకాంతు ధరణికాంతుగాను
ప్రాకటైశ్వర్యమునకెల్లను పట్టభద్రుని చేయదలచెను.
నీకు నీతనయునకు దాస్యము నియమించు నొక యుపాయమున్నది.
నీకు రాజు దేవాసు రాజి నిచ్చిన, వరములు రెండు గలవు,
నీకొడుకు దొరతనము రాఘవునికి వనవాసమును నానసేయుమనే IIసరసII

ఈవిధమున మంధర పలికిన హితవని తలచి సఖిని మెచ్చుచు
నావనిత ధీరజనిత కోపమునను మాసిన చీరగట్టి వెసను 
ఠీవిగ యుడిగి భూషణములన్నియు బాఱవైచి యలుక ఇంటి
లో వొంటిగా నేలబడి పొరలుచుండెను, దయగలవాడైన 
పావనుండయిన, ధీరుడైన దేవసము డయినగాని కుజని
తావినోదమునను వీడడేని తద్గుణానుసారియౌను నిజమిది IIసరసII

అంతట దశరథుడు కైక గృహంబునకు జని నిశ్శబ్దమై
కాంతి చెడి భ్రాంతిపడి మెలగెడి, కలికితండముగని కలగి విభుడు
యింత వింత యిదేమి యన జెలు, లెఱుక, మాకైక యలిగినయది
సంతసము సేయుమన విని యా, దంతిగమనుడు డాసి నీకీ
చింత యేమిటికి కైక నీదు, చిత్తమెటుల జేతునని ని
తాంత మోహమునను, పా, దముల కపుడు నృపుడు మ్రొక్కి దక్కినాననె   IIసరసII

పలికి నా కనినారు మీరలు, ప్రాణేశ మునుపు నా కొసగిన
యలఘు వరములకు భరతుని రా, జ్యాధిపతిగా రాముని కానలో
వెలయ బుదునాల్గేండ్లు మునియై , నిలుప సెలవీయు మనుచు కైక
పలుకవిని వజ్రహత వృక్షము చెలువునను భువిబడి యంతలో
దెలిసి చెడుగు కల గంటిననుచు దలచి వెలగు కలకంఠి నెదుట
పులివలెం గని తిరుగ మూర్ఛిలిన చెలులు బోధజేసి రా ధరాధిపు IIసరసII

భార్య గావు నీవు శత్రువు నా, పాలిటి నీకు రాముడు 
పరిచర్య యాశ్చర్యముగ సల్పును, సతి నీవు రాముని మెత్తువెపుడు
ఆర్యసమ్మతుని బొమ్మన నే, నతివ రాజ్యము గొమ్మని  నృప
వర్య బొంకిన నరకమున బడువాడవని కైక పలుక దశరథుడు 
కార్యమేమనుచు వనటబొంది కందియుండె నారాత్రి చనిన 
సూర్యోదనమున దౌర్యత్రిక, సుభగ నాదశుభ వినోదము లెసగె IIసరసII

ఛత్రచామర తురగ కరిరధ, సముదయము గనుపెట్టె భూషిత,
గాత్రుని పవిత్రుని సుమిత్రాపుత్రయుతుని కంరీద్రారూఢిని
జైత్రాతపత్రాన్వితుని రామచంద్రు గని జను లలరియుండిరి
ధాత్రీశు డేమో రాడని య త్తఱి సుమంత్రుడు చని మ్రొక్కి హా
 పుత్రలలామ హా రామ యన పొగులు రాజు గని కైక నడుగ
రాత్రి నిద్రలే దితనికి శ్రీరాము సుగుణధాము దోడి తెమ్మనె   IIసరసII

దశరథాజ్ఞను సుమంత్రుడు జని, తగ రామవిభు దోడి తెచ్చిన
శశివదను డసిత తనుడగు రఘుసత్తముడు తండ్రికి బ్రణమిల్లెను  
బిసరుహాక్షుని గౌగలించుక పృధివీశు డేడ్వగ వసిష్ఠుడు
మసలకను వచ్చె రాము డిదే, మన కైక భరతునకు రాజ్యము
అసదృశాటవికి నిన్ను బనుప, నడిగినానని పితృవాక్యము
విసువక నడపెదవని శేషగిరి శిఖరాలయుడు విశాలమతియై IIసరసII
  



Thursday, August 15, 2013

వినవేశుక వాణీమాణిక్య, వీణావాదనపటువాణీ II

పూరి కళ్యాణి         ఆదితాళము

పల్లవి -- వినవేశుక వాణీమాణిక్య, వీణావాదనపటువాణీ II

అనుపల్లవి---

మనువంశ్యుడు దశరథు డంతట మం
తనమున వసియిం, చి వసిష్ఠుని ఘనముగ రావించి మన్నించి
వినుమనిపలికె మహాత్మ నిఖిల జను
లును మాటికి వొగడెదరు శ్రీరాముని
ఘనగుణాభి రాముని యువరాజును,
గా నొనర్పవలె నిపుడె భరతు డను
జునిగూడి చనెను మామను గను,
గొన శుభదీక్ష నునుపు రాముని రయముగ ననె IIవినవేII

వరమౌని దశరథుని వీడ్కొని రఘు
వరు నగరికి వేగ రాగా శ్రీ
వారి యెదుర్కొని బాగా వసిష్ఠుని
పరగ సత్కృతులుగాగా జేసి సీతా
తరుణి హైమకలశోదకము లొసంగగ
గురుని యడుగులు గడిగి, శిరము నవ్వారి
ధరియించి సేమమడిగి పూజించి నీ
చరణనీరజధారణ, మున గృతార్ధుడనై
మెఱసితినను దా, శరధి పలుకు విని
చిఱునగవు  దొలకగ పలికె మును నీ,
చరణజలము హరుడు శిరమునందిడి
పరమపురుషుడాయె మాతండ్రి నలువయు నీపదాంబుముల సుఖమయ్యె ననెను IIవినవేII

ఇటులనదగు నే లోకగురుడవు వి, శ్వేశుడవనియు రమాపతి వనియు సము
త్కట యశుడ వనియు బరమాత్ముడ వనియు నిన్ను
కుటిలుల కెఱుగవశ, మా భ క్తపాలన
చటులుడవై భూభారము మాన్ప రావణుని జంపగ మది నెం, చి
పుట్టితివని దిటవున నిశ్చయించి, నామనేను"
అటులైన బహుగోప్యముజేసితి నీ,
వెటుల మాయచే సర్వము జేయుదు
వటుల నేగురుడవని శిష్యుడ నీ,వనుచు
నటన సల్పితి సామి జగ
న్నటనసూత్రధారి యఖిలభూతాం, తర్యామియనన్ వెలయుదువనెను దపసి  IIవినవేII

నీవు శుధ్దసత్వమయమైన మేను నెరిబూని భువియందు మాయామనుజ
భావమున జెలగుచుం, దువకట రాజ సేవ గాసిజెం, దు పౌరోహిత్య
జీవన మతినిందితమని దెలిసియు నీవు రఘువంశమున జనియింతు వని
భావించి సంతసమున నీకు గురుడనై యేవేడుక కిది నే నియ్యకొంటి నాదప మిప్పుడు ఫలియిం, చెనన్నిక నీమా
యావిభూతి కగపఱుపకు దశరథ, భూమినిభుడు నన్ను పట్టము గట్ట శు
భావహుగమ్మనెను సీతతో ధీ, క్షావిధి నుండుమని చనియె వసిష్ఠముని IIవినవేII

శ్రీ విభుడు లక్ష్మణుని గని నన్ను యువరాజ్యాభి, షి క్తుజేసెదరు నేను సాక్షిమాత్రుడను
నీవె సకలము బూను క ర్తవు, భోక్తవు, నీవే నా ప్రాణములు మేనుసుమ్మని పలికె
నావేళ పౌరజనులు రాముని యువరాజ్యశ్రీ వినికడు హెచ్చి దశ, రథుని మెచ్చి
యావార్త లపుడె దెచ్చి కౌసల్యాదేవితో సుమిత్రాదేవితో దెలుప వార
లావా కార్యర్ణనమున సంతోషపూర్ణులై వెలసిరి సురలు, సరస్వతిగని,
దేవి నీవయోధ్యకు జని విఘ్నము గావింపుము రామాభిషేకమన,
నా విబుధ ప్రార్ధన కియ్యకొనె వాణి IIవినవేII

కొమరారు కైక నగరిదాసి యొకతె కుంటిది గూనిది గుజ్జురూపుది మిడిగ్రుడ్లు ముడి
బొమలు డొంకుమైగల, ది యయోధ్యలోను రమణులకు నవ్వులాటది మంధర యను
కుమతి యొక్క తె కలనుభారతి దానిజెంది, కుదురైయుండె నంతఃపురి శృంగారముల
నమరి యంతయు విం, తయై యున్నజూచి
భ్రమసి మంధర తొందరతో వచ్చి కైక రేపు రామునకు పట్టాభిషేక మనిన కైక
ప్రముదమొదవి బంగారం దెలొసగగా పడతి యొల్ల కిది భయసమయము సుఖ నియ
మము గాదబల శేషశైల, స్వామియై రామునిశుభము నీకనెను IIవినవేII