Wednesday, June 23, 2010

శరణు శరణని రామచంద్రుని యహల్య -- సన్నుతించెను వినవే

13.

బిలహరి -- ఆటతాళము

పల్లవి --
శరణు శరణని రామచంద్రుని యహల్య -- సన్నుతించెను వినవే IIశరణుII

అను పల్లవి --
పరమ పురుషు డనుచు గౌతమ వాక్య
సరణి మదిలో నెన్నుచు 
శౌరికి మ్రొక్కి
యరుదార నర్ఘ్య పాద్యము లిచ్చి
హర్ష విస్ఫురి తాక్షియై మించి పులకించి నీ
చరణ రజ పరాగమునను
దురిత మెల్లను తొలగె నహహా
గరిమతోను గృతార్థనైతి జగత్ప్రభో కమలా విభో హరి IIశరణుII


ఏ విభు పాద రాజీవ రేణువులచే
పావనమైనది భాగీరథి, మహాదేవ బ్రహ్మాది సు
రావళి నే మహానుభావుడు గావించె,
నే వరదు పద రజము
వేవేల విధముల వెదక బడును శ్రుతుల
చే, వనజ భవుడెవని శ్రీనాభి పద్మమం
దా విర్భవించె, నవ్యయుడైన పురవైరి
యే విశ్వ గురు నామ మే ప్రొద్దు భజియించు,
నే వీర వరు పాద మీ 
భువన జాలముల నెల్ల నాక్రమించెను,
శ్రీ వనితామణికి నెవ్వని యురము చెల
గి విహరింప నునికి పట్టయ్యె, నే
దేవుని పద మనిందిత రాజయోగి హృధ్యేయమై త
న వారి చెలువు మీఱె,
నా విభుండా వరదుడా గురుడా పరుండా దేవుడిదె నను
బ్రోవుటకు ప్రత్యక్ష మయ్యెన
హో ! విచిత్ర మటంచు నెంచుచు IIశరణుII 1

శ్రీరఘువర నీ లీల లత్యద్భుతము
లే, రికి తరము గాదవి తెలియ, మర్త్యావ
తారమునను జగత్త్రయము మాయా మోహ
పారవశ్యము నొంద భ్రమియించితివి, నిర్వి 
కారుడ వీవు, చలనాది రహితుడవు,
కర చరణా దులు  గలవారి వలె నుందు
వా, రయ పూర్ణుడ వానంద మయుడ, వ
క్రూరుడ వతిమాయికుడవు ,సంవిస్మయో
దార విశుద్ధుడ వా,త్మ ప్రజ్ఞాఖండ బోధ
స్వరూపుడ వజుడవు,
పారమార్ధికుడ వీ, భూతముల కా
ధారభూతము నీవే, యీ జగము నీవే 
సారెకు జగదాశ్రయుడ వీవే, కర్తృ
కారణ కార్యములు నీ విలాసములు,
చేరి గన్గొనగ నేరక తనుధారి వం
దురు గాని నిన్నువిదారి తాఖిల కలుషమగు
పరతత్త్వ మన ఖలులచే నగునా IIశరణుII 2


జలజలోచన నీ వలఘు మాయా గుణ
ములచే బింబితుడవై విలసిల్లి జగ దుదయ
విలయములకు బ్రహ్మ విష్ణీశ్వరనామ
ముల బూని యున్నావు, 
తెలియక నొకడవై వలను మీఱగాను వాచ్య వాచక భేద
ముల జగన్మయుడవై యలరు చుందువు, నీ వ
స్ఖలిత తేజుడ వోం,కార వాచ్యుడవు, వా
క్కుల కగోచరుడవు, గూఢ వర్తనుడవు,
భళి భళి శ్రీరామభద్ర గుణోన్నిద్ర ప్రధనాంగణ రుద్ర
కలిత కౌస్తుభహార శ్రీ శేషా
చల శిఖర విహార మోహనాకార,
చెలిని చంచల సునిశ్చల జ్ఞానమార్గము 
దెలియ నెంతటి దానను ? నీ దానను,
కలుగ జేయుము నాకు నీ పద 
నలిన భక్తి నిరంతరమ్ముగ 
జెలగి, వందన శతము లొనరిం చెదను, దాశరథీ దయానిథీ IIశరణుII 3

No comments:

Post a Comment