Saturday, June 26, 2010

వినీల వేణి వినుత గుణ శ్రేణి, వినవే శర్వాణి

14.

 బేగడ-- ఆటతాళము
పల్లవి --
వినీల వేణి వినుత గుణ శ్రేణి, వినవే శర్వాణి --IIవినీలII

అనుపల్లవి --
ఘనాఘనాంగుడౌ రా
మునిచే ననుజ్ఞగొని గౌతమ
ముని యొద్దకు జనె నహల్య
మునీంద్రు డా రాముని జూచి పలికె
ఘనంబుగను మిధిలాపురంబు
నను, క్రతువరంబు మహేశ్వర చాపము
కనుంగొని యనంతరం బయోధ్యకు
జనెద మనన్ వినమ్రు డయ్యెను హరి హరి. IIవినీలII

రంగ దభంగ తరంగ గంగ ను
ప్పొంగుచు దాటి విదేహ రాజపురి
చెంగట రాగ నెఱింగి జనకుడు చె
లంగుచు నెదురుగను
రంగుగ జని గాధేయునకును సా
ష్టాంగ మెఱగి పూజించి, దిశలు వెలు
గంగ జేయు చంద్ర సూర్యులో సుర
పుంగవులగు నరనారాయణులో
శృంగార కళల బంగారు తళుకు ల
నంగాను దగిన వీర లెవ్వ రె
ఱుంగ వలయు నన, దశథరాత్మజులు
మంగళ కరు లీ రామలక్ష్మణులు మహా భుజుల్ ఘను లని, ముని దెల్పెను IIవినీలII 1


ఠీవిగ మత్క్రతు సంరక్షణమున
కై వీరల నే దోడి తెచ్చునెడ
పావను డీ రాఘవుఁ డొక శరమున
జావనేసెఁ దాటకను
భూవర మదీయ యాగ విఘాతకు
లై వరలు సుబాహు ప్రముఖ నిశచ
రావళి దృంచియు మారీచు జలధి
లో వైచె బదాంబుజ రజమునను
యీ వీరు డహల్యను వేవేగ బవిత్రను
గావించి నేడు నీ గృహంబున గరళకం
ఠు విల్గనుగొన వచ్చెను
నావుడు నగరికి దోడ్కొని చని యా నరేంద్రు డారాముని బూజించెను. IIవినీలII 2

అంతట జనకుడు మంత్రుల బిలిచి పు
రాంతకు విలు దెమ్మనిన భటుల న
త్యంత బలుల నైదువేల బంపిన
బంతము మీద జని
సంతతమును మణి వస్త్రాదులచే
నెంతయు భూషితమై ఘంటా శత
కాంతమైన విలు దెచ్చిన ధరణీ
కాంతుడు కౌశికు గనుగొని యా
వింత నృపవరు లంతా జూడగ
సంతోషమున రఘూద్వహుం డీ చాప మెక్కిడిన జాలును సీతా
కాంత నిత్తు నన విని శ్రీరాముని కనుంగొనె ముని దరహాసమునను IIవినీలII 3

శ్రీరాముడు వామాకరంబున వి
ల్లా రూఢిగ గొని యెక్కడి నృపతులు
చేరి చూడ దక్షిణ కరమున నరు
దారి దిగిచి నపుడే
సారము చెడి ఫెళ ఫెళ మని విరిగెను
వైరి వరుల ధైర్యముతో గూడ ద
దారవము దిశల్నిండె దివి నిమా
నా రూఢు లగుచు గనుగొను దేవత
లా రాముని శ్రీ మీఱ బొగడిరి
తోరంబుగా బ్రసూన వర్షము దుందుభి ధ్వను
ల్సుర వనితా జన చారు నాట్యములు చెల
గ రాఘవుని జనేశు డర్మిలి గౌగిట నుంచెను. IIవినీలII 4

ఫుల్లాంబుజ పత్రాక్షుడు రాముడు
విల్లు విఱచుటలు విని యంతఃపుర
పల్లవాధరలు మన సీతకు శ్రీ
వల్లభు డనం దగిన
వల్లభు డిదె వచ్చెను చల్లనివా
డెల్ల జగములను నేల జాలు వాఁ
వల్ల మరునైన, జక్కదనమున
నుల్లసంబు లాడునటె యమ్మక
చెల్లా రాముని వల్లా కోరిక
లెల్ల ఫలించు వంశపావను, డీ మహాత్ముడంచని పలికి సరస
సల్లాపము లాడుచు సీతకు మణి, సరు ల్వి
రుల్ హరువుగఁ గై సేసిరి IIవినీలII 5

పట్టుచీరె గటికట్టి రవికె చను
కట్టుదిట్టముగ గట్టి మృగమదము 
బొట్టు నుదుట నునిచి కనుల కాటుక
బెట్టి కురులు దువ్వి
దట్టముగ కీల్ముడి వైచి మఱిన్
మట్టుమీఱ వేడుక చే సరములు
జుట్టి సర్వ భూషణములు మేనను
దట్టముగా బూని యుక్క చెలి కేల్
బట్టి, జనకుని పట్టి శౌరికి
పట్టంపురాణి నౌదు నేనని, బాళితోడ గుందనపు బొమ్మవలె
నెట్టన రాజమురాళ కరిగతుల, నెరాకరింపుచు నడిచెను IIవినీలII 6

తాటంక ద్యుతి దిక్కుల నెల్లను
దీటుకొనగ బాపబొట్టును సరి
పాటిలేని చంద్ర సూర్యులును స
య్యాటమునకు మెఱయ
తేటగు ముత్యపు సరులు పతకములు
మేటి చిలుక తాళితోడ బెనగొన
మాటికి నందెలు ఘల్లని మ్రోయగ
దీటులేని వైఖరి సీతా
వధూటి గుణముల పేటీ, హారి కి
రీటాది భూషణాఢ్యు శేషగిరీశు రామ భూవిభుని చేరి మణి
హాటకమయామాలిక గళమున నిడి, హరిన్ వరించితి నని చనె ముదమున IIవినీలII 7 

No comments:

Post a Comment