Friday, May 14, 2010

ఈ సంశయము వారింపవే, పర, మేశ నన్ను మన్నింపవే

2. రేగుప్తి రాగము - ఆటతాళము

పల్లవి - ఈ సంశయము వారింపవే, పర, మేశ నన్ను మన్నింపవే

అనుపల్లవి - శ్రీ సదాశివ ప్రశ్న , జేసెద వివరింపు
              వాసుదేవతత్త్వము, మహత్త్వము
              భాసమానవిలాస నే నిదె 
              నీ సత్కృపావలోకనమున
              నీ సమయమున దెలియవలసిన
              దే సమస్త మిదే ప్రశస్తము  IIఈ సంశ II

జ్ఞాన విజ్ఞాననిశ్చల భక్తివైరా, గ్యానందములకు నిధానమైవిన్న
శ్రీనిలయమై వెన్నవలె మృదువై యస, మానమై నుతిగన్న, మార్గము మిన్న
యైన బహుగోప్యతరమైనయ , నూనముగ సెలవిమ్ము చంచల
లే నితంబినులను నే నీదానదానవవైరి మ్రొక్కద IIఈ సంశII 1

వారిజాక్ష జగదాధారమూ ర్తియై , శ్రీరామునియందు సారసద్భక్తి
కారూఢమై ముక్తి కారణమై యల, రారు నొక్కయుక్తి నాదిశక్తి
మీరరసి ధీరరసికాళిక సారకళ లూర బలుకుము భవ
నీరధికి తారకము భక్తిమీర సుజనులను వేఱె లేరని IIఈ సంశII 2

దేవ శ్రీరాముని దేవదేవునిగా ష, డ్భావాతీతునిగా సుధీవరులెల్ల
భావము రంజిల్ల బల్కుదురతని, భావింతు రదియెల్ల గల్ల గాదె
గావునను శ్రీవిభు ముక్తికి , కేవలము తావలమటైనను
శ్రీ వెలయు భూవలయమున తను, భావుడై జీవుడైన దేమి IIఈ సంశII 3

మాయావృతుడై రామస్వామి సన్ముక్తి దాయకుని గనుతన దాం దె
లియలేడు వేయేల నతడు జూడు, ఆత్మను తత్త్వవేత్తకే నేడు దెలిపినాడు
మాయికుడటంచు రొక కొందఱదేయదార్థము సేయసుజన
ధ్యేయండెటులగునైన జానకి, కాయెడల దా నడల నేటికి IIఈ సంశII4

ఈ వాక్యముల కర్థమీవుగా కితరులు, భావించి పలుక నేర్పరులెవరులేరు
దేవుడవై చెలువుమీరు నిన్ను జేరు , ధీరాత్ములు గోరు కోర్కె లీడేరు
ఈ వసుధ శేష శైలాధిపుడై వెలుగు రాఘవు చరితమును
ధావర్షమై చెవులుపండునుగావించు సేవించు జనులకు IIఈ సంశయII 5

మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు మొత్తం రామాయణ కావ్యాన్ని ( పట్టాభిషేకం వఱకూ ) సుమారు 100 కు పైగా కీర్తనలలో విరచించారు. సుమారుగా ప్రతి కీర్తనకూ పల్లవి , అనుపల్లవి , 5 లేక 6 చరణాలు ఉంటాయి. వీరి కీర్తనలు ద్రాక్షాపాకంతో అలరారుతూ బహువిధమైన అలంకారాలతో కూడి సొగసైన పాటలుగా పాడుకోవటానికి మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. నాకు అర్థమయినంతవరకూ ఈ కీర్తనలలోని అర్థాన్ని చదువరులకు అందించాలనేదే నా తాపత్రయం. ఈ విధంగా నేను చేసే ప్రయత్నంలో తప్పులు దొర్లితే పెద్దలు క్షమించి తెలియజేయ ప్రార్థన.
ఈ రెండవ కీర్తనలో పార్వతీ దేవి శివుడిని రామాయణ కథను చెప్పమని అభ్యర్ధిస్తుంది. ఈ సంశయము వారింపవే, పరమేశ నన్ను మన్నింపవే అని మొదలుపెడుతుంది ఆవిడ పరమేశ్వరుడిని.
రామాయణ గాథ జ్ఞానవిజ్ఞాన దాయకమూ, నిశ్చలభక్తి వైరాగ్యదాయకమై విన్నప్పుడు మనస్సుకు  ఆనందాన్ని చేకూరుస్తుంది. . వెన్నవలె మృదువైనది, అసమానమైనది, ప్రఖ్యాతిని గన్నదీ, మిన్నయైన మార్గాన్ని చూపించేదీను, అట్టి బహురహస్యమైన ఆ కథను నాకు వినిపించండి నేను నీ దానను ఓ దానవ వైరీ ! ఈ సంశయము వారింపవే  అని  పార్వతీదేవి మహేశ్వరుడిని ప్రార్ధిస్తుంది..
జగధాధారమూర్తియైన శ్రీరామచంద్రుని యందుగల భక్తి ఒక ఉపాయమై ముక్తికి కారణమవుతుంది . ఆదిశక్తిని మీరు దర్శించి వివరముగా తెలియజేయండి.
దేవా ! శ్రీరాముని దేవదేవునిగాను, షడ్భావాతీతునిగాను సుధీవరులందఱూ చెబుతుంటారు. అది నిజము కాదు గదా . శ్రీవిభుడు ముక్తికారకుడు, లక్ష్మీదేవి వెలసిన ఈ భూమిమీద మానవ స్వరూపాన్ని ఎందుకు ధరించాడు ?  మాయచేత చుట్టబడి రామచంద్రమూర్తి తానే ముక్తిదాయకుడినని తెలియలేడు. ఆతడు ఆత్మను నేడు తత్త్వవేత్తకే తెలిపినవాడు . అతడు అమాయకుడని కొందఱు భావిస్తే సుజనులకు పూజనీయుడెటు లయ్యాడు ? అతడు జానకీ దేవికి ఎందులకై  భయపడాల్సివచ్చింది ?
ఈ నా సందేహాలకు  నీవుగాక ఇంకెవ్వరూ సరియైన సమాధానాలను ఇవ్వలేరు . దేవుడవైన నిన్నుచేరినవారి కోర్కెలు ఈడేరతాయి. ఈ భూమిమీద శ్రీ వేంకటేశ్వరుని రూపంలో వెలసిన రాఘవుని చరితాన్ని నాకు చెవులపండువుగా సంపూర్ణంగా చెప్పవలసింది, నా పై సందేహాల్ని తీర్చవలసింది.

 http://maganti.org/audiofiles/air/songs/adhyatma2.html

No comments:

Post a Comment