Saturday, August 17, 2013

సరస గుణమణి సన్మందర సఖీకృతేందిరా, IIవినవేII

తోడిరాగము           ఆటతాళము

పల్లవి---
సరస గుణమణి సన్మందర సఖీకృతేందిరా, IIవినవేII
అను పల్లవి--
గరిమమున రాఘవుని యభిషే, కమహోత్సవము శుభ మనక భయా
కర మనుట యేమి శ్రీరాముడ కౌసల్యగా ననుజూచునను
పరమసమ్మతములైన కైక, వచనము ల్వినగ జాలక మం
ధర నీ సుతునకు నీకు సుఖము, దలచినాను దాయగాను దలపకు  IIసరసII

కైక విను భరతశతృఘ్నుల, కేకయపురికనిచి నీ కాంతు
డో కాంత యేకాంతమున సీ, తాకాంతు ధరణికాంతుగాను
ప్రాకటైశ్వర్యమునకెల్లను పట్టభద్రుని చేయదలచెను.
నీకు నీతనయునకు దాస్యము నియమించు నొక యుపాయమున్నది.
నీకు రాజు దేవాసు రాజి నిచ్చిన, వరములు రెండు గలవు,
నీకొడుకు దొరతనము రాఘవునికి వనవాసమును నానసేయుమనే IIసరసII

ఈవిధమున మంధర పలికిన హితవని తలచి సఖిని మెచ్చుచు
నావనిత ధీరజనిత కోపమునను మాసిన చీరగట్టి వెసను 
ఠీవిగ యుడిగి భూషణములన్నియు బాఱవైచి యలుక ఇంటి
లో వొంటిగా నేలబడి పొరలుచుండెను, దయగలవాడైన 
పావనుండయిన, ధీరుడైన దేవసము డయినగాని కుజని
తావినోదమునను వీడడేని తద్గుణానుసారియౌను నిజమిది IIసరసII

అంతట దశరథుడు కైక గృహంబునకు జని నిశ్శబ్దమై
కాంతి చెడి భ్రాంతిపడి మెలగెడి, కలికితండముగని కలగి విభుడు
యింత వింత యిదేమి యన జెలు, లెఱుక, మాకైక యలిగినయది
సంతసము సేయుమన విని యా, దంతిగమనుడు డాసి నీకీ
చింత యేమిటికి కైక నీదు, చిత్తమెటుల జేతునని ని
తాంత మోహమునను, పా, దముల కపుడు నృపుడు మ్రొక్కి దక్కినాననె   IIసరసII

పలికి నా కనినారు మీరలు, ప్రాణేశ మునుపు నా కొసగిన
యలఘు వరములకు భరతుని రా, జ్యాధిపతిగా రాముని కానలో
వెలయ బుదునాల్గేండ్లు మునియై , నిలుప సెలవీయు మనుచు కైక
పలుకవిని వజ్రహత వృక్షము చెలువునను భువిబడి యంతలో
దెలిసి చెడుగు కల గంటిననుచు దలచి వెలగు కలకంఠి నెదుట
పులివలెం గని తిరుగ మూర్ఛిలిన చెలులు బోధజేసి రా ధరాధిపు IIసరసII

భార్య గావు నీవు శత్రువు నా, పాలిటి నీకు రాముడు 
పరిచర్య యాశ్చర్యముగ సల్పును, సతి నీవు రాముని మెత్తువెపుడు
ఆర్యసమ్మతుని బొమ్మన నే, నతివ రాజ్యము గొమ్మని  నృప
వర్య బొంకిన నరకమున బడువాడవని కైక పలుక దశరథుడు 
కార్యమేమనుచు వనటబొంది కందియుండె నారాత్రి చనిన 
సూర్యోదనమున దౌర్యత్రిక, సుభగ నాదశుభ వినోదము లెసగె IIసరసII

ఛత్రచామర తురగ కరిరధ, సముదయము గనుపెట్టె భూషిత,
గాత్రుని పవిత్రుని సుమిత్రాపుత్రయుతుని కంరీద్రారూఢిని
జైత్రాతపత్రాన్వితుని రామచంద్రు గని జను లలరియుండిరి
ధాత్రీశు డేమో రాడని య త్తఱి సుమంత్రుడు చని మ్రొక్కి హా
 పుత్రలలామ హా రామ యన పొగులు రాజు గని కైక నడుగ
రాత్రి నిద్రలే దితనికి శ్రీరాము సుగుణధాము దోడి తెమ్మనె   IIసరసII

దశరథాజ్ఞను సుమంత్రుడు జని, తగ రామవిభు దోడి తెచ్చిన
శశివదను డసిత తనుడగు రఘుసత్తముడు తండ్రికి బ్రణమిల్లెను  
బిసరుహాక్షుని గౌగలించుక పృధివీశు డేడ్వగ వసిష్ఠుడు
మసలకను వచ్చె రాము డిదే, మన కైక భరతునకు రాజ్యము
అసదృశాటవికి నిన్ను బనుప, నడిగినానని పితృవాక్యము
విసువక నడపెదవని శేషగిరి శిఖరాలయుడు విశాలమతియై IIసరసII
  



2 comments:

  1. I have great facination and admire ..... I do not exactly know whether any of the telugu families still have this heritage.........some 55 years back one sri jonnalagadda siva sankara sastry garu used to be an exponent on these krithis. All india radio vijayawada did broadcast them in bhakti ranjani program that used to be there at 6.30 am
    They must be preserving these tapes .his son in law jalasutram rukmininadha sastry garu , a popular figure in telugu literary circles must have these collections. ( manam telugu vaallam.charitra marchipovadam mana janma hakku)

    ReplyDelete
  2. మీ కామెంటుకు నా ధన్యవాదాలండి.

    ReplyDelete