Sunday, July 4, 2010

చేరి వినవె శౌరి, చరితము-గౌరి, సుకుమారి గిరివరకుమారీ

17
సురటి రాగము -- ఆదితాళము
పల్లవి --
చేరి వినవె శౌరి చరితము
గౌరి సుకుమారి గిరివరకుమారీ IIచేరిII

అనుపల్లవి --
వారిజాక్షు డంతటను శ్రీ 
మీరి వేడ్కతో నయోధ్యకు
గోరి పోవుదారిలో నృప
వైరియైన పరశురాముడు
కారు మొగులు కరణి చాప
ధరుడై కాలమృత్యువో యనగ బం
క్తి రధు జేరి హరి యెదుటను నిలిచి పలికెను 
వీరాధివీరుడని యెఱుంగక IIచేరిII

బెండువంటి నిల్లు నడిమికి
రెండు జేసి పెల్లు పొందు
కొండ నెనయు నా విల్లు
దండి వైరులకు ముల్లు
కడు గండు మిగిలి దీని నెక్కు బెట్టిన గాని రా
ముడనను నిన్ను నటు గా
కుండిన జంపుదు నన రాము డతని కో
దండము గొని చక్క నెక్కిడి య
ఖండాశుగము తగ
దొడిగి తెగ నింద దిగిచి భార్గ
వుడ నిను కాండాహత చరణు జేసి నృప
కాండాభి రాముడనౌదు ననిన
బుండరీకలోచను డి
తండని పూర్వకాల సంస్మృతి
పొడమి పొగడి భండప్రచండపండితుం డవ
జాండాధిపతి నవ్యయుడ వనెను IIచేరిII 1

బాల్యమునను నేను ఘోర తపంబు సేయుచోను హరి వా
త్సల్య మొప్పగాను వేగ ప్రసన్నుడై పలికె దాను, సా
ఫల్య మయ్యె నీ తపము జన సమ్మతము నున్చి వంశయుతుడ వగు, సా
ఫల్యంబలుడ వగుచు బితృహననుడగు కార్తవీర్యు గెలిచి ఖలు నృపుల వై
కల్యాత్మకుల జంపి శమదమ ముఖ్యార్థితుడ వగుము నే గౌ
సల్యా గర్భమున రాముడన గల్యాణదాయినై జనించి య
హల్యాసతి బవిత్ర జేసి సీతను, గల్యాణమై నీకు దరిశనమ
తుల్యముగ నొసగుదునని జనియె దయ,తోనా హరియ నీవని చనియె IIచేరిII 2

స్వామి నేను మించి హేహయ వంశజులను ద్రుంచి శాంతుండ
నై ముదము దలంచి చెలగెద నీ మహా మహిమ నుంచి ఖగ
గామినీ బలంబు నీవు గొంటివి గాన నే ధన్యతముడ నైతిని
నీ మహనీయ దరిశనము గలిగె బితామహాదుల కగోచరుడవు శ్రీ
రామా మనోహరుడ వగు రఘురామా ప్రకృతికంటె పరుడవు
కామాద్యరివర్గ దూరు డ వహో మాధవ భవ రహితుండవు
కామకర్త గుణవర్జితు డవు నుదకమున ఫేన జాలములు ననలమున
ధూమమెటుల నటులనే యభిజనమును నీ మాయచే గల్పితం బనె. IIచేరిII 3

ఎందాక నరుండు మాయకు హితవు మీరకుండ వినువా
డందాక జడుండు వానికి నాత్మ గానరాకుండు తన
యందు గల్గు నవిచారమున విద్య మిగుల బ్రబలినదై విద్య నణచు
పొందు గానవిద్యాకృత మగుటను బంధుబింబితుండై జీవాత్మను
బొందు తను మనః ప్రాణమునబొందు నపుడె స్వాభిమానము
నొందు నపుడె సుఖదుఃఖముల నొందు నాత్మకు సంసృతి లే
దెందు జ్ఞాన మిపుడు బుద్ధికిని లే దిది నైజము వ్యాకృతమున బ్రకృతి
పొందుగాను సంసారి యయ్యేహుత భుగ్వార మేళనంపు క్రియ ననె IIచేరిII4

ఎంతదాక నరుడు నీ పదహితుల పొత్తు జొరడు విను వా
డంత దాక నరుడు వలెను భవాబ్ధి దిరుగు పామరుండు ఏ
కాంతుడయి సుజన సంగతి వలనను గనిన భక్తి చేత నెపుడు నిన్ను న
నంతు నాశ్రయించి నపుడు మాయకు
నంత మజితుడును స్వప్రకాశుడును
శాంతాత్మకుడు నైన సద్గురు డంతవాని కగపడును సుని
శాంతానంద మతనిచే గని చింతల నెల్ల ద్రుంచి ని
రంతరాత్మ సుఖము జెందు నీ పద రాజీవయుగ భక్తి లేని నరు
లంతమొంది జ్ఞానముక్తి సుఖముల నంద వశముగాక చెడుదు రనె. IIచేరిII 5

ఈ శరణు శరణు దురిత వి
నా శరణు శరణు సుజన
క్లేశ హరణ శరణూ జయ జయ శ్రీరా
మ శరణు శరణు నే జేసినట్టి పుణ్యమెల్ల నీదు మ
హాశుగమున కొసగినాడ నను దయ
జేసి బ్రోవు మన బరశురామునకు సీతా విభుడు ప్రసన్నుడై పలికె
వాసి నీ మనంబునను వరము గోరు నిను కృప
జేసినానన భృగుకులుడు భాసిల్లుచు నీదు పద రజో
లేశమునకు నే వరంబు సమ మఖి
లేశ భక్తి నిమ్మన గృతార్థుని జేసి పనుప జనియె జామదగ్ని ని
జేచ్ఛం దనుజ రిపు నుతించుచు జనె IIచేరిII 6

ప్రీతుడయ్యె జలా దశరథ విభు డంతట వీలా గుణముల
చేత నలరి తగ పురి జేరి చక్రి యావేళ భూ
జాత నరసి తనరె, ననుజులు నిజ సతుల రతుల విభవ స
మేతుడు జగత్ప్రభుడు బ్రధితగుణ
జాతు డవ్యయానందమూర్తి సం
గీతానంత కీర్తి సుగుణ భూతాద్యఖిల సాక్షి మాయా
జాతాఖిల కలుషహరుడు సాకేతాధిపు డై యుండె హరి ద
యాతిశయత నిదియు జెప్పె సుబ్రహ్మణ్య కవి శేషగిరీశుపేర వి
ఖ్యాతి మీఱ నధ్యాత్మ రామాయణాఖ్యానమున బాలకాండ మిది IIచేరిII 7

6 comments:

 1. Meeru Dhanyulu !!

  Emta pUnyam Kattukunnaru

  Ee blogu lo ee paatala saahityam , maaganti.org lo
  ee paatala okappati bhakti ranjani recordingula to patu vImtoo umte .... ala naadu Sadguru SriTyagaraja swami "Nenendu vedukuduraa " ani dukhistuoo taanu kolpoyina tana imtloni archaa vigrahaalu doraka gaane " Nanu paalimpaga nadachi vachchitivaa ... " ani keertana chesina anaandam anubhavam loki vachchindi.

  cherigipoyimdankunna gataanniki jeevam posi aa Sree Ramachandruni yokka sadaanutaanamaina sanaatanatvam ajaraamaram ani niroomipimchina nimittulu .... meeru nijamgaa muktulu

  Suyanaarayana Saripalle

  ReplyDelete
 2. రామాయణం గొప్పతనమది. మనదేమీ లేదు. అందరితో పంచుకుని ఆనందిద్దామనే స్వార్థం తప్ప.
  ఆ శ్రీరామచంద్రుడు "నను పాలింపగ నడచి వస్తాడనే" ఆశ నాకూ ఉంది. అందుకే నా ఈ ప్రయత్నమంతా. మీ వాత్సల్యానికి నా ధన్యవాదాలు.

  ReplyDelete
 3. అయ్యా,
  ఈ మీ టపా లింకును నా నేటి టపా రేఫరహిత శివధనుర్భంగము యథాతధంగా ఇచ్చాను, ఇది మీకు సమ్మతం కాని పక్షంలో లింకునుతొలగించి URL ఇస్తాను. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 4. చిన్నపుడు ఆలిండియా రేడియో లో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలని వినవే పల్లవ వినుత అని వచ్చేవి చాలా చిన్నతనం అవడం వాళ్ళ అంతగా విన్లేదు

  ReplyDelete
 5. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పూర్తిగా (ఆడియో) ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతాయా డి వి డి రూపం లో?

  ReplyDelete
 6. ఇక్కడ ఈ‌కీర్తన చదివి చాలా ఆనందం‌ కలిగింది.
  ఈ కీర్తనలను చిన్నప్పుడు రేడియోలో వినటమే.
  ఎక్కడన్నా ఇవి వినదొరికితే మహాభాగ్యమేను.

  ReplyDelete