Thursday, July 1, 2010

కల్యాణము వినవే , నేఁడు సీతా , కల్యాణము వినవే

16.
కల్యాణి -- ఆట తాళము

పల్లవి --
కల్యాణము వినవే , నేఁడు సీతా , కల్యాణము వినవే II కల్యాణII

అను పల్లవి --
కల్యాణమయమైన
కల్యాణనిలయమున
కల్యాణప్రదుడౌ య
హల్యా వరదునిIIకల్యాణII


వేదనాదములు వేణుమర్దళ వీణాదుందుభి డిండిమాది మహా
వాద్యనాదములు పుణ్యాంగనా బృంద శుభ గాన 
నాదములుఁ జెలగ జనకుఁ డెదుర్కొని దశర
థాది భూపతుల కర్హాసన మునిచి యా మీఁద సపురోహితుఁ
డై దేవముఖు హైమవేదిఁ బ్రతిష్టించి వివిధ మంత్రములచే
వేదోక్త హోమ విథు లొనరించి సీతాది కన్యల ధన్యల నల్వురను స
మ్మోదమున రావించి మురియుచు శుభజాలా
పాదకముగ మధుపర్క మిచ్చి వేడ్క
బ్రోది జేసి నృపుడు పూజించె రాఘవుల IIకల్యాణII 1

శ్రీమీర జనకుడు శృంగారవతియై సౌ
దామినీ లత మాడ్కి దనరెడు సీతా
కోమలి తెఱ మఱుగున నుంచి చాలగా,
రాముని రామాభి రాముడైన శ్రీ
రామచంద్రుని పాద రాజీవములు గడిగి,
సేమమున తజ్జలము శిరమున ధరియించి,
నీమముతో సీత నిఖిల లోకమాత
గామిత సిద్ధ సంకల్ప పూర్వకముగ
భూమీశుడు ధారబోసె నగ్నిసాక్షి
గా మానవతిని, రాఘవుడు చేకొనె, దేవ
తా మందార సుమధారలు గురిసె, భ
ద్రామితగుణులై యనిరి వధూవరుల పై IIకల్యాణII 2

అంతట దెరదీయ నతివమోము జూచి 
సంతసించెను రామచంద్రు కన్గవ తార
కాంతు గనుగొని యలరు కలువలిపోల్కి నా
యింతి చూపులు దనరె హృదయేశు పదయుగళి
నెంతయు దామరల నెనయు తేటులనగా
కాంతామణి పాణిగ్రహణ మొనరజేసి 
కంతు జనకుడు మంగళ సూత్రము గట్టి
దంతిగమనకు మణులు తలంబ్రాలు పోసి శ్రీ
మంతుడై లాజహోమము జేసి కృతకృత్య
స్వాంతు డయ్యెను తాటకాంతకు, డట మీద 
సంతతానందమున జనకు డూర్మిళ నిచ్చె 
మంతు కెక్కగాను లక్ష్మణకుమారునకు II కల్యాణ II 3

వరుస తోడను కుశధ్వజుని కొమార్తెల 
సురుచిర మాండవి శ్రుతకీర్తుల నిరువురను
భరత శతృఘ్నులకును జనకధరణీశు డానంద
భరితు డగుచు నొసఁగె, నరుదారగ బెండ్లి యల
రారె నావేళఁ, జిరతర యశులు వసిష్ఠ విశ్వామిత్రు
లురువుగ నా వధూవరులకు సేసలు శిరమున నిడిరి యా
శీర్వాదములు జేసి, ఇనవంశ దశరథాధీశుడు దీవించె
గరిమను, కౌసల్య కైక సుమిత్రాది 
కరిగమనలు మంగళహారతు లొసంగి రా
తఱి రామలక్ష్మణ భరతశతృఘ్నులకు IIకల్యాణII 4

జనకవిభుడు కౌశికుని వసిష్ఠుని గను
గొని పల్కె నారదముని యచటి కొకనాడు
చనుదెంచి నను వినుమని పలికె హరిభక్త
జనవరదుడని నిర్జరులను బ్రోవ రా
వణు వధియింప రఘువంశమునకు రాము
డను పేర దాశరథి యై నాలుగంశములు
జననమొందెను, సీత యను నామమున నీ యిం
టను యోగమాయ బుట్టెను దెలిసి కౌసల్య
తనయునకు సీత నిమ్మని చనె నది మొదలుగను సీత శ్రీసతి 
యని తలచి యే విధమున రాము డల్లుడౌనని చింతించి ధను
వను నెపమున మీద యను శుభము గంటి ననె IIకల్యాణII 5

శ్రీరామచంద్రుని జేరి జనకుడు బలికె
శౌరీ నా జన్మము సాఫలమాయె ను
దార సింహాసనస్థలిని సీతాయుతుడ
వై రంజిల నిన్ను జూడ నర్హుడ నైతి రా
మా రమణ భువన నిర్మాణ నైపుణి గలిగె
నీరజ భవునకు నీ పాద వారిచే
నీరమ్య పదజలము నెరిదాల్చి బలి మహా
వీరుడై సురరాజ విభవము చేకొనె
సారమౌ నీ పదరజమున నహల్య 
ఘోరశాపము దొలగె కోవిదులును నీ యు
దారాంఘ్రి రేణువులు కోరి భవభయ 
దూరు లైనట్టి నీవే శరణని పొగడె రాముని IIకల్యాణII 6

సొరిది యా సమయమున 
సురదుందుభులు మ్రోసె ధ్రిగుడుతద్దిన్నాంతకిటతక, తా థై థై య్యనుచు న
చ్చరలాడిరి గంధర్వ వరులు బాడిరి భూ
సురవరుల ధరణీ వరుల బూజజేసి
సరస మృష్టాన్నాభోజనము లిడి రీ
కరణి పరగ నాల్గునాళ్ళు జరుగుటయు గౌశికు 
డరిగె నల్లుండ్రకు నరణమిచ్చినృపుడు
కరుణచే బుత్రికల ఘనమతుల గాంచి
త్వరతోడం బనుప నా దశరథ క్షితిపతి
వరసుతులు గోడండ్రు సిరు లలర నాశేష
గిరి వాసుడైన రఘువరుని మున్నిడుకొని 
పురికి ప్రయాణోన్ముఖు డయ్యె ముదమున II కల్యాణII 8













No comments:

Post a Comment