Thursday, July 1, 2010

కల్యాణము వినవే , నేఁడు సీతా , కల్యాణము వినవే

16.
కల్యాణి -- ఆట తాళము

పల్లవి --
కల్యాణము వినవే , నేఁడు సీతా , కల్యాణము వినవే II కల్యాణII

అను పల్లవి --
కల్యాణమయమైన
కల్యాణనిలయమున
కల్యాణప్రదుడౌ య
హల్యా వరదునిIIకల్యాణII


వేదనాదములు వేణుమర్దళ వీణాదుందుభి డిండిమాది మహా
వాద్యనాదములు పుణ్యాంగనా బృంద శుభ గాన 
నాదములుఁ జెలగ జనకుఁ డెదుర్కొని దశర
థాది భూపతుల కర్హాసన మునిచి యా మీఁద సపురోహితుఁ
డై దేవముఖు హైమవేదిఁ బ్రతిష్టించి వివిధ మంత్రములచే
వేదోక్త హోమ విథు లొనరించి సీతాది కన్యల ధన్యల నల్వురను స
మ్మోదమున రావించి మురియుచు శుభజాలా
పాదకముగ మధుపర్క మిచ్చి వేడ్క
బ్రోది జేసి నృపుడు పూజించె రాఘవుల IIకల్యాణII 1

శ్రీమీర జనకుడు శృంగారవతియై సౌ
దామినీ లత మాడ్కి దనరెడు సీతా
కోమలి తెఱ మఱుగున నుంచి చాలగా,
రాముని రామాభి రాముడైన శ్రీ
రామచంద్రుని పాద రాజీవములు గడిగి,
సేమమున తజ్జలము శిరమున ధరియించి,
నీమముతో సీత నిఖిల లోకమాత
గామిత సిద్ధ సంకల్ప పూర్వకముగ
భూమీశుడు ధారబోసె నగ్నిసాక్షి
గా మానవతిని, రాఘవుడు చేకొనె, దేవ
తా మందార సుమధారలు గురిసె, భ
ద్రామితగుణులై యనిరి వధూవరుల పై IIకల్యాణII 2

అంతట దెరదీయ నతివమోము జూచి 
సంతసించెను రామచంద్రు కన్గవ తార
కాంతు గనుగొని యలరు కలువలిపోల్కి నా
యింతి చూపులు దనరె హృదయేశు పదయుగళి
నెంతయు దామరల నెనయు తేటులనగా
కాంతామణి పాణిగ్రహణ మొనరజేసి 
కంతు జనకుడు మంగళ సూత్రము గట్టి
దంతిగమనకు మణులు తలంబ్రాలు పోసి శ్రీ
మంతుడై లాజహోమము జేసి కృతకృత్య
స్వాంతు డయ్యెను తాటకాంతకు, డట మీద 
సంతతానందమున జనకు డూర్మిళ నిచ్చె 
మంతు కెక్కగాను లక్ష్మణకుమారునకు II కల్యాణ II 3

వరుస తోడను కుశధ్వజుని కొమార్తెల 
సురుచిర మాండవి శ్రుతకీర్తుల నిరువురను
భరత శతృఘ్నులకును జనకధరణీశు డానంద
భరితు డగుచు నొసఁగె, నరుదారగ బెండ్లి యల
రారె నావేళఁ, జిరతర యశులు వసిష్ఠ విశ్వామిత్రు
లురువుగ నా వధూవరులకు సేసలు శిరమున నిడిరి యా
శీర్వాదములు జేసి, ఇనవంశ దశరథాధీశుడు దీవించె
గరిమను, కౌసల్య కైక సుమిత్రాది 
కరిగమనలు మంగళహారతు లొసంగి రా
తఱి రామలక్ష్మణ భరతశతృఘ్నులకు IIకల్యాణII 4

జనకవిభుడు కౌశికుని వసిష్ఠుని గను
గొని పల్కె నారదముని యచటి కొకనాడు
చనుదెంచి నను వినుమని పలికె హరిభక్త
జనవరదుడని నిర్జరులను బ్రోవ రా
వణు వధియింప రఘువంశమునకు రాము
డను పేర దాశరథి యై నాలుగంశములు
జననమొందెను, సీత యను నామమున నీ యిం
టను యోగమాయ బుట్టెను దెలిసి కౌసల్య
తనయునకు సీత నిమ్మని చనె నది మొదలుగను సీత శ్రీసతి 
యని తలచి యే విధమున రాము డల్లుడౌనని చింతించి ధను
వను నెపమున మీద యను శుభము గంటి ననె IIకల్యాణII 5

శ్రీరామచంద్రుని జేరి జనకుడు బలికె
శౌరీ నా జన్మము సాఫలమాయె ను
దార సింహాసనస్థలిని సీతాయుతుడ
వై రంజిల నిన్ను జూడ నర్హుడ నైతి రా
మా రమణ భువన నిర్మాణ నైపుణి గలిగె
నీరజ భవునకు నీ పాద వారిచే
నీరమ్య పదజలము నెరిదాల్చి బలి మహా
వీరుడై సురరాజ విభవము చేకొనె
సారమౌ నీ పదరజమున నహల్య 
ఘోరశాపము దొలగె కోవిదులును నీ యు
దారాంఘ్రి రేణువులు కోరి భవభయ 
దూరు లైనట్టి నీవే శరణని పొగడె రాముని IIకల్యాణII 6

సొరిది యా సమయమున 
సురదుందుభులు మ్రోసె ధ్రిగుడుతద్దిన్నాంతకిటతక, తా థై థై య్యనుచు న
చ్చరలాడిరి గంధర్వ వరులు బాడిరి భూ
సురవరుల ధరణీ వరుల బూజజేసి
సరస మృష్టాన్నాభోజనము లిడి రీ
కరణి పరగ నాల్గునాళ్ళు జరుగుటయు గౌశికు 
డరిగె నల్లుండ్రకు నరణమిచ్చినృపుడు
కరుణచే బుత్రికల ఘనమతుల గాంచి
త్వరతోడం బనుప నా దశరథ క్షితిపతి
వరసుతులు గోడండ్రు సిరు లలర నాశేష
గిరి వాసుడైన రఘువరుని మున్నిడుకొని 
పురికి ప్రయాణోన్ముఖు డయ్యె ముదమున II కల్యాణII 8













Wednesday, June 30, 2010

విను హైమవతీ ఘనా ఘన సుందరాకృతీ వినుతధృతీ కరుణామతీ

15.

కాఫీ రాగము - జంపె తాళము

పల్లవి --

విను హైమవతీ ఘనా
ఘన సుందరాకృతీ
వినుతధృతీ కరుణామతీ.
IIవినుII

అనుపల్లవి -

తన మంత్రులను
బనిచె దశరథుని తోడి తె
మ్మని జనక నృపతి వేగా బాగా
IIవినుII


ఆరూఢి దివస త్రయమున వార లయోధ్యఁ జేరి దశరథుని గాంచి
ధీరులై మ్రొక్కి బహు దివ్య వస్తువుల నరు
దారగా గాన్క యుంచి శ్రీరామునకు జయశ్రీ ర
మా రామునకు సీతను నిశ్చయించి నేడు శ్రీ
మీర మిము బిలువనం పెను జనకు డన
సంభ్రమించి వేడుక దలఁచి మించి IIవినుII 1


జనవిభుడు శ్రీరామ చంద్రునకు గల్యాణ
మని చాట నాన తిచ్చి జనక మంత్రుల
కు నుత్సాహమున రత్న భూషణ దుకూలముల నిచ్చి
తన గురుఁడగా వసిష్ఠుని సుమంత్రుని రా
ముని పెండ్లి వార్త దెచ్చె - తగు గదా
జనకవిభు బాంధవ్య మనిన కడు లెస్స యని
రనువుగా ముదము హెచ్చి మెచ్చి IIవినుII 2


మరునాడు గురుహిత సమస్త జను లెల్ల నే
మఱు బలసి కొలువ గాను
అరుదైన యాణిముత్యముల గొడుగుల నీడ నధికవైభవముతోను
భరత శత్రుఘ్ను లిరువురు గజారూఢులై
యిరుగడల జేరి రాను రథమెక్కి
నరవరుడు మిథిలా న
గరమునకు జనె నెలమి, నాల్గు పైనములలోను తాను IIవినుII 3


హితమతిని దశరథున కెదురుగా జని పురోహిత సహితుడై జనకుడు
చతురుడై పూజింప, సరసులై రామలక్ష్మణులు తమ తండ్రి కపుడు
అతి భక్తి ప్రణమిల్ల నాలింగన మొనర్చె నానందమునను నృపుడు
తత మహోన్నత జనకరాజ సదనమున
సుత కౌశికాన్వితుడై వసించె నతడు జనహితుడు IIవినుII 4


తన యాగ కర్మమంతయు దీర్చి జనకుడు శ
తానందు తోడ ననెను దనర సంకాశ్యపుర
మున మదనుజుడు కుశ ధ్వజుండు మోదమునను
మొనసి పిలువనంపు మన విని యట్లు సేయ జ
య్యన వచ్చి యత డన్నను పొడగాంచి
తన కుమారికలు తా నును మ్రొక్కి వర్థిల్లు
డనుచు దీవెనలు గొనెను మనెను IIవినుII 5


లలిని జనకుడు పుర మలంకరింపు మన దోరణ చ
యోల్లాసితంబు అలఘు సౌధధ్వజో
జ్వలము గోపుర వితానావళీ రాజితంబు
ఫల భార నమ్ర రంబా స్తంభ శోభిత ప్రతిగృహ ప్రాంగణంబు కర్పూర
కలితాంబు పూర గంధిల రాజమార్గంబు, కై సేసి రా పురంబు దంబువి IIవినుII 6


క్రమముతో నంతఃపురమ లంకరించి బంగారు కుంభముల నుంచి
సమమైన పర్చరా జగతీ పై నిలిపి నీలముల బోదెలు ఘటించి
రమణీయముగను బగడముల దూలములు వజ్రముల గొడిగెలు రచించి చెతుర్ద్వా
రముల గొమరొప్ప గల్యాణ వేదిక గట్ట కమరికను సంతసించి మేలెంచి IIవినుII 7


ఎలమి సీతాది కాంతలకు నలుగులు పెట్టి తల లంటి జలక మార్చి
జిలుగుల దడి యొత్తి చెలగి సరిగంచు చీరెలు గట్టి కురులు గూర్చి
వలనొప్ప గొప్ప కొప్పులు బెట్టి చందనం బలదికములు దీర్చి రవికలను
పొలయ చనుకట్టుపై నలవరచి కై సేయ నలదిరి సమముగ జేర్చి మది జేర్చి IIవినుII 8


పరగ కేకయపతి కుమారుడు యుధాజిత్తు వచ్చెనచ్చటికి నంత
వరుస దశరథుడు నల్వురు సుతుల భూషణా వళుల గై సేసి చెంత
సిరు లలర దానుండు తరి జనకుడానంద భరితుఁడై భద్ర దంతావళములను
గరిమమున బనుప రాఘవు లెక్కి రాజమార్గమున జూపట్టి రంత వింత IIవినుII 9


పొదలుచును గౌసల్య మొదలౌ సతులు గొల్వ భూపతులు జేరి కొలువ
విదిత మాగధ వంది బృందములు గొలువ నట విట గాయకులును గొలువ
సదయులు వసిష్ఠ విశ్వామిత్రు లాశీర్వచనము లొసంగుచును గొలువ కల్యాణ
సదనమున కరిగె శేషగిరీశు డగు రామచంద్రుఁ డెద ముదము మొలువ చెలువ IIవినుII 10

Saturday, June 26, 2010

వినీల వేణి వినుత గుణ శ్రేణి, వినవే శర్వాణి

14.

 బేగడ-- ఆటతాళము
పల్లవి --
వినీల వేణి వినుత గుణ శ్రేణి, వినవే శర్వాణి --IIవినీలII

అనుపల్లవి --
ఘనాఘనాంగుడౌ రా
మునిచే ననుజ్ఞగొని గౌతమ
ముని యొద్దకు జనె నహల్య
మునీంద్రు డా రాముని జూచి పలికె
ఘనంబుగను మిధిలాపురంబు
నను, క్రతువరంబు మహేశ్వర చాపము
కనుంగొని యనంతరం బయోధ్యకు
జనెద మనన్ వినమ్రు డయ్యెను హరి హరి. IIవినీలII

రంగ దభంగ తరంగ గంగ ను
ప్పొంగుచు దాటి విదేహ రాజపురి
చెంగట రాగ నెఱింగి జనకుడు చె
లంగుచు నెదురుగను
రంగుగ జని గాధేయునకును సా
ష్టాంగ మెఱగి పూజించి, దిశలు వెలు
గంగ జేయు చంద్ర సూర్యులో సుర
పుంగవులగు నరనారాయణులో
శృంగార కళల బంగారు తళుకు ల
నంగాను దగిన వీర లెవ్వ రె
ఱుంగ వలయు నన, దశథరాత్మజులు
మంగళ కరు లీ రామలక్ష్మణులు మహా భుజుల్ ఘను లని, ముని దెల్పెను IIవినీలII 1


ఠీవిగ మత్క్రతు సంరక్షణమున
కై వీరల నే దోడి తెచ్చునెడ
పావను డీ రాఘవుఁ డొక శరమున
జావనేసెఁ దాటకను
భూవర మదీయ యాగ విఘాతకు
లై వరలు సుబాహు ప్రముఖ నిశచ
రావళి దృంచియు మారీచు జలధి
లో వైచె బదాంబుజ రజమునను
యీ వీరు డహల్యను వేవేగ బవిత్రను
గావించి నేడు నీ గృహంబున గరళకం
ఠు విల్గనుగొన వచ్చెను
నావుడు నగరికి దోడ్కొని చని యా నరేంద్రు డారాముని బూజించెను. IIవినీలII 2

అంతట జనకుడు మంత్రుల బిలిచి పు
రాంతకు విలు దెమ్మనిన భటుల న
త్యంత బలుల నైదువేల బంపిన
బంతము మీద జని
సంతతమును మణి వస్త్రాదులచే
నెంతయు భూషితమై ఘంటా శత
కాంతమైన విలు దెచ్చిన ధరణీ
కాంతుడు కౌశికు గనుగొని యా
వింత నృపవరు లంతా జూడగ
సంతోషమున రఘూద్వహుం డీ చాప మెక్కిడిన జాలును సీతా
కాంత నిత్తు నన విని శ్రీరాముని కనుంగొనె ముని దరహాసమునను IIవినీలII 3

శ్రీరాముడు వామాకరంబున వి
ల్లా రూఢిగ గొని యెక్కడి నృపతులు
చేరి చూడ దక్షిణ కరమున నరు
దారి దిగిచి నపుడే
సారము చెడి ఫెళ ఫెళ మని విరిగెను
వైరి వరుల ధైర్యముతో గూడ ద
దారవము దిశల్నిండె దివి నిమా
నా రూఢు లగుచు గనుగొను దేవత
లా రాముని శ్రీ మీఱ బొగడిరి
తోరంబుగా బ్రసూన వర్షము దుందుభి ధ్వను
ల్సుర వనితా జన చారు నాట్యములు చెల
గ రాఘవుని జనేశు డర్మిలి గౌగిట నుంచెను. IIవినీలII 4

ఫుల్లాంబుజ పత్రాక్షుడు రాముడు
విల్లు విఱచుటలు విని యంతఃపుర
పల్లవాధరలు మన సీతకు శ్రీ
వల్లభు డనం దగిన
వల్లభు డిదె వచ్చెను చల్లనివా
డెల్ల జగములను నేల జాలు వాఁ
వల్ల మరునైన, జక్కదనమున
నుల్లసంబు లాడునటె యమ్మక
చెల్లా రాముని వల్లా కోరిక
లెల్ల ఫలించు వంశపావను, డీ మహాత్ముడంచని పలికి సరస
సల్లాపము లాడుచు సీతకు మణి, సరు ల్వి
రుల్ హరువుగఁ గై సేసిరి IIవినీలII 5

పట్టుచీరె గటికట్టి రవికె చను
కట్టుదిట్టముగ గట్టి మృగమదము 
బొట్టు నుదుట నునిచి కనుల కాటుక
బెట్టి కురులు దువ్వి
దట్టముగ కీల్ముడి వైచి మఱిన్
మట్టుమీఱ వేడుక చే సరములు
జుట్టి సర్వ భూషణములు మేనను
దట్టముగా బూని యుక్క చెలి కేల్
బట్టి, జనకుని పట్టి శౌరికి
పట్టంపురాణి నౌదు నేనని, బాళితోడ గుందనపు బొమ్మవలె
నెట్టన రాజమురాళ కరిగతుల, నెరాకరింపుచు నడిచెను IIవినీలII 6

తాటంక ద్యుతి దిక్కుల నెల్లను
దీటుకొనగ బాపబొట్టును సరి
పాటిలేని చంద్ర సూర్యులును స
య్యాటమునకు మెఱయ
తేటగు ముత్యపు సరులు పతకములు
మేటి చిలుక తాళితోడ బెనగొన
మాటికి నందెలు ఘల్లని మ్రోయగ
దీటులేని వైఖరి సీతా
వధూటి గుణముల పేటీ, హారి కి
రీటాది భూషణాఢ్యు శేషగిరీశు రామ భూవిభుని చేరి మణి
హాటకమయామాలిక గళమున నిడి, హరిన్ వరించితి నని చనె ముదమున IIవినీలII 7 

Wednesday, June 23, 2010

శరణు శరణని రామచంద్రుని యహల్య -- సన్నుతించెను వినవే

13.

బిలహరి -- ఆటతాళము

పల్లవి --
శరణు శరణని రామచంద్రుని యహల్య -- సన్నుతించెను వినవే IIశరణుII

అను పల్లవి --
పరమ పురుషు డనుచు గౌతమ వాక్య
సరణి మదిలో నెన్నుచు 
శౌరికి మ్రొక్కి
యరుదార నర్ఘ్య పాద్యము లిచ్చి
హర్ష విస్ఫురి తాక్షియై మించి పులకించి నీ
చరణ రజ పరాగమునను
దురిత మెల్లను తొలగె నహహా
గరిమతోను గృతార్థనైతి జగత్ప్రభో కమలా విభో హరి IIశరణుII


ఏ విభు పాద రాజీవ రేణువులచే
పావనమైనది భాగీరథి, మహాదేవ బ్రహ్మాది సు
రావళి నే మహానుభావుడు గావించె,
నే వరదు పద రజము
వేవేల విధముల వెదక బడును శ్రుతుల
చే, వనజ భవుడెవని శ్రీనాభి పద్మమం
దా విర్భవించె, నవ్యయుడైన పురవైరి
యే విశ్వ గురు నామ మే ప్రొద్దు భజియించు,
నే వీర వరు పాద మీ 
భువన జాలముల నెల్ల నాక్రమించెను,
శ్రీ వనితామణికి నెవ్వని యురము చెల
గి విహరింప నునికి పట్టయ్యె, నే
దేవుని పద మనిందిత రాజయోగి హృధ్యేయమై త
న వారి చెలువు మీఱె,
నా విభుండా వరదుడా గురుడా పరుండా దేవుడిదె నను
బ్రోవుటకు ప్రత్యక్ష మయ్యెన
హో ! విచిత్ర మటంచు నెంచుచు IIశరణుII 1

శ్రీరఘువర నీ లీల లత్యద్భుతము
లే, రికి తరము గాదవి తెలియ, మర్త్యావ
తారమునను జగత్త్రయము మాయా మోహ
పారవశ్యము నొంద భ్రమియించితివి, నిర్వి 
కారుడ వీవు, చలనాది రహితుడవు,
కర చరణా దులు  గలవారి వలె నుందు
వా, రయ పూర్ణుడ వానంద మయుడ, వ
క్రూరుడ వతిమాయికుడవు ,సంవిస్మయో
దార విశుద్ధుడ వా,త్మ ప్రజ్ఞాఖండ బోధ
స్వరూపుడ వజుడవు,
పారమార్ధికుడ వీ, భూతముల కా
ధారభూతము నీవే, యీ జగము నీవే 
సారెకు జగదాశ్రయుడ వీవే, కర్తృ
కారణ కార్యములు నీ విలాసములు,
చేరి గన్గొనగ నేరక తనుధారి వం
దురు గాని నిన్నువిదారి తాఖిల కలుషమగు
పరతత్త్వ మన ఖలులచే నగునా IIశరణుII 2


జలజలోచన నీ వలఘు మాయా గుణ
ములచే బింబితుడవై విలసిల్లి జగ దుదయ
విలయములకు బ్రహ్మ విష్ణీశ్వరనామ
ముల బూని యున్నావు, 
తెలియక నొకడవై వలను మీఱగాను వాచ్య వాచక భేద
ముల జగన్మయుడవై యలరు చుందువు, నీ వ
స్ఖలిత తేజుడ వోం,కార వాచ్యుడవు, వా
క్కుల కగోచరుడవు, గూఢ వర్తనుడవు,
భళి భళి శ్రీరామభద్ర గుణోన్నిద్ర ప్రధనాంగణ రుద్ర
కలిత కౌస్తుభహార శ్రీ శేషా
చల శిఖర విహార మోహనాకార,
చెలిని చంచల సునిశ్చల జ్ఞానమార్గము 
దెలియ నెంతటి దానను ? నీ దానను,
కలుగ జేయుము నాకు నీ పద 
నలిన భక్తి నిరంతరమ్ముగ 
జెలగి, వందన శతము లొనరిం చెదను, దాశరథీ దయానిథీ IIశరణుII 3

Tuesday, June 22, 2010

వినవే సుగుణాన్వితా, గిరిరాజసుతా

12.

సౌరాష్ట్ర -- ఆదితాళము

పల్లవి --
వినవే సుగుణాన్వితా, గిరిరాజ సుతా IIవినII

అనుపల్లవి --

మునియుతులై రాఘవులు కామా శ్రమ
మునను నాడు నిలిచి వేకువ
ఘనులు సిద్ధాశ్రమ గతులై రచటి
మునులా రాఘవులను పూజించిరి IIవినII

శ్రీరఘురాముని, చే ననుజ్ఞ గొని
సారయశుడు విశ్వామిత్రుడు క్రతు
వారంభించే, మహా జన వృతుడై
సారెకు మారీ,చ సుబాహు లసృ
గ్థారలు గురిసి రహో
ధీరుడు దాశర,థి మహోద్ధతుడై
మారీచు ననిల, మార్గణమున
వారధిలో బడ, వైచి సుబాహు ని
దారితు జేసెను, దహనాస్త్రమునకు IIవినII 1

సునిశిత బాణము, లను సౌమిత్రి త
గ ననుచరులను జంపెను పువ్వుల జడి
నెనసి సురలు గురి,యించిరి సంభ్రమ
మునను గుశిక సుతు డిన కులకుని
తన తోడ నిడికొని
నెనరున కౌగిట నునిచి లక్ష్మణుని,
మునువిడి కొనియా,డి ఫలములు
అనఘులకును భోజనము లొనర్చెను.
దినములు మూడిటు, జనెను సరసముగ IIవినII 2

మునిపతి శ్రీరా,మునితో బలికెను
జనకుని యాగము, గనుగొన జనియెద
ననువుగ మీరు వచ్చిన శుభమౌనన
వినతు డగుచు నను,జుని గూడి తపో
ధనువెంట ముదముతో
జని చని యెదుటను వన మొకటి ఫల సు
మన స్తరు లతా లం,కృతమై
జన విరహితమై గనుపట్టినది,
వన మేమన రా, మునితో ముని బలికె IIవినవేII3

గౌతము డను ముని , గలడు లోక వి
ఖ్యాతు డాతని కహల్య యను సతిని
ధాత యొసంగెనా, దంపతు లిచ్చట
బ్రీతి నుండ నింద్రుడు నొకనాడా
గౌతమ వేషమున 
నాతి నెనసి చను, నాతరి స్నాతుడై
గౌతమ ముని వచ్చి , భస్మీ
భూతు జేతు నాతో బొంకకు మన బురూ
హుతు దుర్మతి నైతిఁ గావు మనెను IIవినవేII4

శాప మొసంగెను, సహస్ర భగుడ
వై పొమ్మని వృత్రారి నహల్యను కోపమున శిలా
రూపము గమ్మనెనే వర జంతు ర, 
హితముగ జేసెను యీ వనమా మోని
బాపురే యెన్నడు నీపై రఘుపతి 
శ్రీ పాదము వెట్టు నాటికి 
శాపము చెడునని, జనె సతీమణికి
పాపము బాపవె, పరమ పురుషా యనెను IIవినవేII5

 రాముని కరము క,రమ్మున బట్టి మ
హా ముని యప్పుడ, హల్యను జూపిన
భామ పైని దన, పాదము నుంచి మ
హా మతి యగుచు నహల్య తనర గని
రాముడు తా మ్రొక్కె రామా మణియు స 
లక్ష్మణుని ధను ర్బాణ ధరుని కనకాం, బరుని
శ్రీ మన్మందస్మిత వదనుని శ్రీ రాముని శేషాద్రి 
ధాముని జూచెను IIవినవేII 6

Monday, June 21, 2010

ఇందు వదనా వినవే యీ చరితము కుందరదనా

11.
నాదనామక్రియ - ఆట తాళము
పల్లవి --
ఇందు వదనా వినవే యీ చరితము
కుందరదనా IIఇందుII

అనుపల్లవి --
డెందము శ్రీ మన్ము
కుందుని పాదారా
విందములం దా
నందింప జేసి రా IIకేందుII

ధీరుడు విశ్వామి, త్రుడు తా నయోధ్యకు
శ్రీరాముని జూడ వచ్చెను అని
వారుడై సౌధము జొచ్చెను, ఎదురు
గా రాజు చని తోడి తెచ్చెను, మునికి
చారు సింహాసన మిచ్చెను, మహో
దారుడై పూజ యొనర్చెను. కరము
లారూఢి నౌదల జేర్చెను, స్వామి
మీరు వచ్చుట కేమి, కారణ మది దెల్పు
డీ రాజ్యమైన మీ , కిచ్చెద ననెను రా IIకేందుII 1

కౌశికు డా పూజ, గై కొని పల్కె, భూ
మీశ మారీచ సుబాహులు, మాం
సాశను లద్భుత దేహులు, ఘోర
పైశాచిక ప్రేత వాహులు, కాల
పాశ విడంబిత బాహులు, దివి
జేశాది సుర ముని ద్రోహులు , యజ్ఞ
నాశకు లధిక దుర్మోహులు, గా
డాసి వారల పొగ ర,డంచన లక్ష్మణుని
జేసి రాముని బంపు, మీకు శుభమౌ ననె IIఇందుII 2

భూమీశు డే కాంత, మున వసిష్టుతో బల్కె
నేమి సేయుదు నేమందును నెట్లు
రాముని నెడబాసి యుందును, సుగుణ
ధాము నెన్నడు గనుగొందును, గురు
స్వామి యెవ్విధి సుఖము జెందును, ఈ వి
శ్వామిత్రు నుడి యెటు విందును, ఇతని
కేమి మనవి జేసికొందును, నేను
యీ మాట వినకున్న నిపుడే శాప మిచ్చు
నీ మౌని యనిన గురు డిట్లని యనెను రా IIకేందుII 3

నరవర వినుమిది పరమ రహస్యము
నరుడా శ్రీ రఘురాముడు, ఘోర
దురితాంధకార విరాముడు, హరి
పరమాత్ముడు కమలా కాముడు, భక్త
వరదుడు ప్రణత సుత్రాముడు, దిన
కర వంశ జలనిధి సోముడు, మౌని
వరదేవతా సార్వఙౌముడు, ఇతడు
పరమేష్ఠిచే తొల్లి ప్రార్థితు డయి భూమి
భరము మాన్ప నీ, వరతనయుఁ డాయె ననె IIనిందుII 4

రాజా నీవు కశ్యప బ్రహ్మవు కౌసల్య
జేజేల కెల్లను తల్లి, అదితి
నా జను తరుణీమ తల్లి, మీరు
శ్రీ జాని భజియించి తొల్లి, చాలా
పూజింప నత డుల్లసిల్లి, సుతుడు
నై జనియించెద మీకు నెల్లి, నని య
వ్యాజ కరుణా రసము జల్లి, నేడు
రాజీవాక్షుడు రాముఁడై జూపట్టె శేషు
డే జుమి లక్ష్మణు డిది నిజ మనెను రా IIకేందుII 5

వర శంఖ చక్రము, ల్భరత శతృఘ్నులై
ర రుదార హరి యాజ్ఞ చేత, సురు
చిరు యోగ మాయయె సీత, యనగ
మెఱసి జనక వంశ జాత, యై
పరగు చున్నది ధీసమేత, వినుత
సరస సద్గుణ మణి వ్రాత, యిది
పరమ గోప్యము స లక్ష్మణుని రాముని మౌని
వరు వెంట బంపుమని బల్కె వసిష్టు IIడిందుII 6

రామ లక్ష్మణులను రాజు పిలువ బంచి
ప్రేమతో గౌగిట నుంచెను, తనను
హా మహిమ నుతియించెను, తన
దే మహద్భాగ్యమని యెంచెను వి
శ్వామిత్రు జాల పూజించెను. ఘన
శ్యాముని నతని కర్పించెను. శుభ
మౌ మీకని దీవించెను, శ్రీ
రాము లంతట ధనుర్బాణ తూణీర ధరు
లై మించి ముని వెంట, నతిమోదమున జని IIరిందుII 7

లలిని బలా తిబలలను రెండు వి
ద్యలు రామునకు మౌని యిచ్చెను. రాము
డలరి గంగా నదిని మెచ్చెను, ఆ
వల బోవ దాటకి వచ్చెను, దాని
బొలియింప మని ముని సెల విచ్చెను. ఆ
వెలది యాబిడ రూపు విడి యక్ష సతియై
చెలగి రాముని బొగడి, శ్రీ మీఱ జనెను రా IIకేందుII 8

కౌగిట రాముని, గదియించి జడదారి,
వేగమే శిరము ముద్దాడెను, అంత
బాగాయెనని కొనియాడెను . మహా
యోగి ధ్యేయుడ వనుచు వేడెను, వీత
రాగుడై భయమెల్ల వీడెను, నిగ
మాగమ మంత్ర రహస్యములను దాల్చె
నీ గతి శేషగిరీశు డై హరికి రా IIకేందుII 9







 

Sunday, June 20, 2010

రాముని సకల గుణాభి రాముని నిఖిల రాక్షస వి రాముని వర్ణింప వశమా

10.
ముఖారి - ఆదితాళము

పల్లవి -
రాముని సకల గుణాభి
రాముని నిఖిల రాక్షస వి
రాముని వర్ణింప వశమా IIరామునిII
అనుపల్లవి -
వేమాఱు కౌసల్య నీ వే
మేమి గోరినా వది యెల్ల
శ్రీ మీఱ నొసగితి ననుచు
ప్రేమచే జననితో బలికిన IIరామునిII

మున్ను బ్రహ్మ నన్ను వేడు
కొన్న భూభారము దీర్ప
వన్నె మీరగను నేడు, నీ గర్భమున
జెన్నలర బుట్టితి చూడు, రావణాసురు
డన్నిట గర్వించినాడు, వాని వధియించి
సన్నుతి గాంచు నీ రేడు, జగములలోన
మున్నలర దశరథుడు నీవు 
నన్ను దపమున మెప్పించి 
కన్నారు నీ వదితి వతడు, కశ్యపుడని కౌసల్యకు దెలిపిన  IIరామునిII 1


అనుచు దల్లితో బలికి, హరి ముద్దుబాలుడై కలికి
తనమున హరి నీలగాత్రుడై, వికసిత నవ్య
వనజదళ విశాల నేత్రుడై, చక్కని వా
డనుచు నుతియింప పాత్రుడై, అమల ప్రకాశ
మునకు జూడ దరుణ మిత్రుడై, విలసిల్లె నంత
ఘనుడైన తనయుడు గల్గె
నని విని దశరథు డానంద
మునను గురునితోడ గూడీ, 
చనుదెంచి కన్గొనెను శ్రీ రఘు IIరామునిII 2

విరులవాన లపుడు గురిసె, వేడ్క జయదుందుభులు మొరసె
సురసుందరు లెలమి నాడిరి, గంధర్వ వరులు
సరసులై రాగములు బాడిరి, మౌనులు దోషా
చరుల వలని భయము వీడిరి, పౌరులానంద
కరుని జూడ గుమిగూడిరి దశదిశల యందు
పరిమళ మిలితములైన తెమ్మెరలు విసరె దివిని సురలు
వర విమానారూఢులై శ్రీ, హరి హరీ యని మ్రొక్కిరాత్మాIIరామునిII 3

ఘనవిభుడైన కొమరుని, గనెను కైక చంద్రబింబా
ననులను సుమిత్ర గనెను, సుతుల నిర్వురను
మొనసిన సంతోషమునను దశరథుడు సకల
ధనముల విప్రుల దనిపెను, వసిష్ఠ మహా
ముని యా బాలురకు క్రమమునను రామ భరత ల
క్ష్మణ శత్రుఘ్నులనుచు నామ, కరణము
లొనరించెను భరతుండును శత్రుఘ్నుడు జోడై, లక్ష్మ
ణుడు ననుసరించెను దశరథ IIరామునిII 4

చెలగి సౌమిత్రు తో గూడి మెలగుచుం దేనియ లొలుక
బలుకు సుతుని నృపుడు గాంచి, భూషణ జాల
ముల తోడ నలంకరించి శిస్తు గస్తూరి 
తిలకము నుదుట నుంచి గళమున రత్న 
కలిత హారములు గీలించి, ముద్దాడు నపుడు
కల కల నవ్వుచు మద్ది, కాయ లల్లాడ నందియలు
ఘల్లు ఘల్లు మనుచు మ్రోయ 
లలిత గతుల నటియించు శ్రీ IIరామునిII 5

చిన్నారి బొజ్జలో నన్ను గన్నవాడా నా పాలిటి
పెన్నిధానము రారా, యోరి నా చిన్ని
యన్న బూచి వచ్చేరారా, పరుగెత్త వల
దన్న నాతో నలుగ మేరా, పాటపాడుచు
నిన్ను లాలి యూచే రారా లాల బోసేను
మన్ను చేత నంటవద్దు వెన్న బెట్టే ననుచు చాలా
మన్నించి పలుకు కౌసల్యకు, మరులు రెట్టింప జేయు IIశ్రీరామునిII 6

ధరణి విభుడు, భుజియించు, తఱిని కౌసల్య తనయుని
మురిపెమున రమ్మని జీర, పరమయోగి హృదయాం
తరమునందు జెల్వు మీర, వసియించు దేవుడు
చిరుత వాడయి ముద్దు గార, వచ్చిన జూచి
తరుణి తనదు కోర్కెలు మీర, కౌగిటనుంచి
కరుణించి భుజియించు మనిన, కబళము చేనందుకొని
తిరుగా నాటలాడు పరుగెత్తిన మాయా బాలకుడౌ శ్రీ IIరామునిII 7

వితత యశుడు దశరథ భూ, విభు డంతట కౌమారాన్వితుల
సుతుల దిలకించి, యుపనయనములు
పతులముగ నొనరించి, వశిష్ఠు నొద్ద
శృతుల నెల్ల చదివించి, చతురంగముల
గతుల దెలియ నేర్పరించి, చౌ షష్ఠి విద్య 
చతురులను గావించి, హర్షించ వారు 
సతతము గురు బంధుమిత్ర, జనులకెల్ల 
హితులై ధైర్యోన్నతులై పరగిరందులో శ్రీ, 
యుతుడయి సత్యవ్రతుడైన శ్రీ IIరామునిII 8

తల్లి దండ్రులకు ప్రియము, దనరగ నశ్వము నెక్కి
విల్లునమ్ములు చేపట్టి, వేటలాడుచు 
మొల్లమున నడవినున్నట్టి, మృగముల గుండెలు
ఝల్లు ఝల్లున జుట్టి ముట్టి , పోనీక వాని
నెల్ల చలపట్టి పడగొట్టి సౌమిత్రి గూడి
బల్లిదుడై యన్ని యయోథ్యా వల్లభునకు కాన్క జేసి 
సల్లలితుడై సకల జనుల, సవినయముగ బాలించు శ్రీIIరామునిII 9

శైల రాజ కన్యకా యీ, చందమున మనుజావతార
లీలమై వర్తించెడు శౌరి, గనుగొను మింద్ర
జాలికుడు చక్రధారి, సమస్త వేద
మూలమై విలసిల్లు దారి, యజ్ఞులు దెలియ
జాల రతడు నిర్వికారి, విమత సంహారి
శ్రీలచే జెలువందు శేష, శైలశిఖరాగ్ర విహరణ
శీలుడై సద్భక్తలోక, పాలుడై దనరు నిత్యాత్మా IIరామునిII 10